ఈడీ నివేదిక కూటమి నేతలకు చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

ఈడీ నివేదిక కూటమి నేతలకు చెంపపెట్టు

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం దుర్మార్గం మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

బాపట్ల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం అంశంపై గతంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలు తప్పని తాజాగా తేలిందని, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం వాడుకోవడం దురదృష్టకరమని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి విమర్శించారు. తిరుమల లడ్డూపై కూటమి నేతల ఆరోపణలు అబద్దాలు అని ఈడీ తేల్చడంపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు కూటమి నాయకులు చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని తాము మొదటి నుంచే చెబుతున్నామన్నారు. తాజాగా సాక్షాత్తు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేటే లడ్డూల్లో ఎటువంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారించిందన్నారు. జంతుకొవ్వుల ఆనవాళ్లే లేవని నివేదికలో ప్రకటించిందన్నారు. తిరుమల వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రాజకీయ ఆరోపణల వేదికగా మార్చడం సరికాదని, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే లడ్డూ వివాదాన్ని సృష్టించారన్నారు. పవిత్రమైన దేవస్థానాల పేరును రాజకీయ లబ్ధి కోసం వినియోగించడం ప్రజలు గమనిస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. ప్రత్యేక పూజల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌ బాబు, మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement