రేపటితో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం నేటితో మండల పరిషత్ చైర్మన్‌లకు ముగియనున్న పదవీ కాలం 2021లో అత్యధిక మెజార్టీతో జెడ్పీని కై వసం చేసుకున్న వైఎస్సార్ సీపీ ప్రత్యేకాధికారుల పాలనలోకి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ పదవీ కాలం ఈనెల 24న ముగియనుంది. ఇందుకు ఒక్కరోజు ముందుగా మండల పరిషత్ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం బుధవారం ముగుస్తోంది. దాదాపు 62 ఏళ్లుగా ఉమ్మడిగా కొనసాగిన గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ నూతన జిల్లాల ఆవిర్భావంతో మూడుగా విడిపోయింది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ముగిసిన మరుసటి రోజు నుంచే పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 2021లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ సీపీ అత్యధిక మెజార్టీతో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ను కై వసం చేసుకుంది. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కానుండటంతో గుంటూరు నుంచి విడిపోయిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా జెడ్పీలను ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ప్రజా పరిషత్ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఉద్యోగుల విభజనపై కసరత్తు
పల్నాడు, బాపట్ల జిల్లాలు విడిపోగా మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ఈనెల 24న ముగియనుండగా, మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్‌ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు జరుగుతోంది. కాగా కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తాత్కాలికంగా జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆయా జిల్లా కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తరువాత గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. గుంటూరుతో సంబంధం లేకుండా సంబంధిత జిల్లాల్లో కార్యకలాపాలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపధ్యంలో గుంటూరు జిల్లాలో 16 మండలాలతో జెడ్పీ పరిమితం కానుంది.


