మా భూములు తీసుకోవాలనుకోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

మా భూములు తీసుకోవాలనుకోవడం దారుణం

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

మా భూములు తీసుకోవాలనుకోవడం దారుణం

జీవనాధారమైన భూములను కాపాడండి మార్టూరులో ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు విన్నవించుకున్న గిరిజనులు

మార్టూరు(చినగంజాం): నాగరాజుపల్లి గ్రామ గిరిజనులు కుటుంబాలు ( సుగాలీలు) తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని మా భూములు మాకే దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తండా వాసులు కలెక్టర్‌ వి. వినోద్‌కుమార్‌కు విన్నవించుకున్నారు. మార్టూరు రెవెన్యూ కార్యాలయం వద్ద కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో నాగరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు చెందిన రమావత్‌ శ్రీను నాయక్‌, కళ్యాణ్‌ నాయక్‌, పర్ష్యానాయక్‌ తదితరులు కలెక్టర్‌ కలిసి తమ సమస్యను విన్నవించుకొని అర్జీ అందజేశారు. నాగరాజుపల్లి గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా గ్రామ సర్వే నంబర్‌ 516,517,528,529,530లలో భూములను సాగు చేసుకుంటూ మెరకలు, గుంటలు ఉన్న భూమిని బాగు చేసుకొని జీవనం చేస్తున్నామని తెలిపారు. ఆ భూమిపై ఆధారపడి భార్యభర్తలు, పిల్లలతో కూడిన కుటుంబాలు జీవిస్తున్నామని తమకు వేరే జీవనాధారం లేదని చెప్పారు. ప్రభుత్వం వారు సదరు భూమికి సంబంధించి పాస్‌పుస్తకాలు, పట్టాలు ఇచ్చారని కలెక్టర్‌కు తెలియజేశారు. అయితే ఆ భూములను ఆన్‌లైన్‌ చేయక పోవడంతో పలు మార్లు కలెక్టర్‌ దృష్టికి సమస్యను కూడా తీసుకెళ్ళామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల ఆ భూములను ఎంఎస్‌ఎంఈ ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం చేసేందుకు ఇస్తున్నట్లు తెలిపి వాటిని స్వాధీనం చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూములను కోల్పోతే 70 గిరిజన కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందని వాపోయారు. దీనికి సంబంధించి కేంద్ర ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని, వారి దగ్గరు నుంచి తమకు ఉత్తర్వులు అందాయని తెలిపారు. వాటిని పరిశీలించి తమ భూములు తమకు ఉండేలా న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం భూముల పరిశీలన చేసే నిమిత్తం కలెక్టర్‌ సందర్శిస్తారని తెలుసుకున్న ఆయా కుటుంబాలు సభ్యులు భూముల వద్ద వేచి చూసారు. కలెక్టర్‌ కార్యాలయ పనుల నిమిత్తం రాకపోవడంతో గిరిజన కుటుంబాలు వెనుదిరిగి వెళ్లిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement