గుంటూరు రూరల్: ద్విచక్రవాహనంపై వెళుతూ ద్విచక్రవాహనంపైనుంచి దూకే క్రమంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చల్లా నాగవర్థన్‌రెడ్డి (25), అదే గ్రామానికి చెందిన మస్తాన్‌లు ఇద్దరు నల్లపాడులోని ఒక బార్‌లో మద్యం సేవించారు. అనంతరం గుంటూరువైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం నడుపుతున్న మస్తాన్ వాహనాన్ని అతి వేగంగా నడిపిస్తుండగా వెనుక కూర్చున్న నాగవర్థన్‌రెడ్డి భయపడి ద్విచక్రవాహనంపై నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనంపై నుంచి దూకటంతో స్పీడుకు తట్టుకోలేక రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్నాడు, అక్కడినుంచి పక్కనే ఉన్న పంచర్‌షాపులోని గాలి సిలెండర్‌కు ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మస్తాన్ అదేవిధంగా స్పీడు గా వెళుతూ రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. మస్తాన్‌కు గాయాలయ్యాయి. స్థానికులు మస్తాన్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా, నాగవర్థన్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


