సమగ్ర దర్యాప్తు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

Sep 3 2026 4:21 AM | Updated on Sep 3 2026 4:21 AM

వెల్ఫేర్‌ బిల్డింగ్‌ అండ్‌ ఎస్టేట్‌ సంస్థపై

తాడేపల్లి రూరల్‌: వెల్ఫేర్‌ బిల్డింగ్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చేతిలో తాము మోసపోయామని ఆరోపిస్తూ, సదరు సంస్థపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాధితులు బుధవారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల తరఫున నెల్లూరు నుంచి వచ్చిన ఏజెంట్లు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన మళ్లా విజయ్‌ ప్రసాద్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంస్థలో తాము కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పటికీ చాలామందికి ఒప్పందాల ప్రకారం రావాల్సిన మొత్తాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ కార్యకలాపాలు, మెచ్యూరిటీ బకాయిలకు సంబంధించి గతంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయినట్లు, సంస్థ వ్యవహారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనకు వెళ్లినట్లు తమకు తెలిసిందన్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్నా బాధితుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంస్థ వ్యవహారాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోరారు. సంస్థకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలను గుర్తించి, వాటి విక్రయం ద్వారా వచ్చే మొత్తాలను బాధితుల బకాయిల చెల్లింపులకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బినామీ ఆస్తులపై కూడా విచారణ జరిపి, ఆస్తుల బదిలీలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని, బాధితుల క్లెయిమ్‌ల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధుసూదనరావు, సుభాషిణి, బిల్లా లక్ష్మి దేవి, నాగేంద్ర కుమార్‌, ప్రసాద్‌, పద్మమ్మ, షరీఫ్‌, శ్రీనివాసులు, సుభాషిణి, లక్ష్మీదేవి, ఎస్‌.శ్రీనివాసులు, బ్రహ్మయ్య, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మహిళల క్రికెట్‌ టోర్నీ

పెదకాకాని: వీవీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్కే ప్రసాద్‌ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళల క్రికెట్‌ టోర్నమెంట్‌ బుధవారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య వీవీఐటీయూ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. మొత్తం 8 కళాశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌ పోరులో వీవీఐటీ వర్సిటీ జట్టు, విష్ణు వర్సిటీ జట్లు తలపడ్డాయి. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వీవీఐటీయూ జట్టు విజయం సాధించగా, విష్ణు విశ్వవిద్యాలయం జట్టు రన్నరప్‌గా నిలిచింది. పోటీల ముగింపు కార్యక్రమంలో చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతగా నిలిచిన వీవీఐటీయూ జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన విష్ణు విశ్వవిద్యాలయం జట్టుకు ట్రోఫీలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్‌ డీన్‌ డాక్టర్‌ కె.గిరిబాబు, ఫిజికల్‌ డైరెక్టర్స్‌ డాక్టర్‌ ఎన్‌.అరుణ్‌ కుమార్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement