తాడికొండ: తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయాల్సి వస్తుందని ఏపీ జేఏసీ అమరావతి యూనిట్ అధ్యక్షుడు బెజ్జం అశోక్ బాబు అన్నారు. బుధవారం అమరావతి యూనిట్ జేఏసీ సమావేశం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జం అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఏపీ ఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్లలో ఉద్యోగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షుడు దిబ్బయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నెక్కల్లు, తుళ్లూరు, శాఖమూరు, కొండమరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులకు బుధవారంరాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానం ద్వారా 37 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది, ఆ ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ– లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియ చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కెఎస్ భాగ్యరేఖ, సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో కలసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా 17 మంది రైతులకు 37 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 24 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 13 కమర్షియల్ ప్లాట్లు. ఈ సందర్భంగా డైరెక్టర్ కెఎస్ భాగ్యరేఖ మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జీఐఎస్ సిబ్బంది గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ల్యాండ్స్(క్యాపిటల్ రీజియన్) బి.గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.పద్మావతి, బి.సాయి శ్రీనివాస నాయక్, జి.మురళీధర్, ప్లానింగ్, ల్యాండ్స్, జీఐఎస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


