చేనేత సహకార సంఘాలపై సర్కారు నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చేనేత సహకార సంఘాలపై సర్కారు నిర్లక్ష్యం

Sep 3 2026 4:21 AM | Updated on Sep 3 2026 4:21 AM

సమస్యల పరిష్కారానికి ఉద్యమించడానికి సిద్ధం

సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి

రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేయాలి

ఐక్య కార్యాచరణ కమిటీ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు

మంగళగిరి టౌన్‌: చేనేత సహకార సంఘాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితో సహకార రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, మనుగడ సాగించడమే కష్టంగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు, నాయకులను సమాయత్తం చేసి తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

ఎన్నికల ఊసేది?

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2013 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్య పాలనకు దూరమయ్యాయని అన్నారు. రాజకీయ పదవులకు కాలపరిమితి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తున్న విధంగానే సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఎనిమిదేళ్లుగా చేనేత రంగానికి సంబంధించిన ట్రిఫ్ట్‌ ఫండ్‌, యార్న్‌ సబ్సిడీ, మార్కెట్‌ ఇన్సెంటివ్‌, పావలా వడ్డీ, రిబేట్‌ తదితర ఐదు సంక్షేమ పథకాల కింద సుమారు రూ.203 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేసి చేనేత కార్మికులు, సహకార సంఘాలను ఆదుకోవాలని కోరారు. కేడీసీసీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన రూ.46.19 కోట్ల రుణమాఫీ ఫైలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఫైలుకు ఆమోదముద్ర వేసి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే 1985 హ్యాండ్‌లూమ్‌ రిజర్వేషన్‌ యాక్ట్‌ ప్రకారం చేనేత రంగానికి రిజర్వు చేసిన వస్తువుల తయారీ, విక్రయాలపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చేనేత దుస్తులపై జీఎస్టీ రీఇంబర్స్‌మెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆప్కో నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.97 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో ఇప్పటికే సుమారు 300 సంఘాలు మూతపడ్డాయని, మిగిలిన సంఘాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోకన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బండారు ఆనంద ప్రసాద్‌, పిల్లలమర్రి బాలకృష్ణ, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, దామర్ల మోహన్‌, దొంతంశెట్టి సత్యప్రకాష్‌, గొట్టుముక్కల బాలాజీ, ఏ. నారాయణ, డోగిపర్తి రామారావు, పచ్చల థామస్‌, బండారు మస్తాన్‌, ఉట్ల సాంబశివరావు, వాసు, విజయ్‌కుమార్‌, కట్టా హేమసుందర్‌రావు, జ్ఞాన శంకరరావు, చింత వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు

విడుదల చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement