చర్యలు తీసుకుంటాం..
అంతా అడ్డగోలుగానే...
పంట భూములను ప్లాట్లుగా మార్చి విక్రయం
గ్రామాల్లో ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు
నిబంధనలకు నిట్టనిలువునా పాతర
మాయమాటలతో అంటగడుతున్న వ్యాపారులు
కొనుగోలు చేసిన సామాన్యులకు కష్టాలు
ప్లాటు అంటగడితే
చెలరేగిపోతున్న రియల్ ఎస్టేట్ అక్రమార్కులు
చీరాల టౌన్: చీరాల రెవెన్యూ, పంచాయతీ అధికారులకు చేతులు తడిపితే చాలు.. ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లు వేయవచ్చు. కళ్లెదుటే అక్రమంగా వెంచర్లు వేస్తున్నా వారు అటువైపు చూడటం లేదు. తమకు ఆదాయ వనరుగా మారడంతో అక్రమ లే అవుట్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. చీరాల ప్రాంతంలో జనాభా పెరుగుతుండటంతో నివాస ప్రాంతాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో 50 సెంట్ల వ్యవసాయ భూమిని కూడా వెంచర్లుగా వేస్తున్నారు. భూములకు డిమాండ్ పెరగడంతో పంట పొలాలను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అసైన్డ్ భూములను సైతం దర్జాగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం 216 బైపాస్ రోడ్డు, పాత ఎస్సీ కాలనీ రోడ్డు, కుందేరు ఒడ్డు తదితర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ ఇప్పుడు ప్లాట్లుగా మారాయి. వాడరేవు తీరానికి వెళ్లే రోడ్డులో, జాండ్రపేట కుందేరు సమీపంలో, అలానే చీరాల పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సైతం ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. గవినివారిపాలెం, విజయలక్ష్మీపురం, చేనేత కాలనీ, కొత్తపాలెం, చీరాలనగర్, వాడరేవు, పిట్టువారిపాలెం, బుర్లవారిపాలెం, పెర్లవారిపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా పొలాలు పాట్లుగా మారుతున్నాయి. తాజాగా వాడరేవు తీరం ఒడ్డునే నాలుగు ఎకరాల్లో నూతన వెంచర్‌ను సిద్ధం చేస్తున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఒడ్డును కూడా శుభ్రం చేసేశారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
సర్కారుకు చెల్లించాల్సిన పన్నును కూడా రియల్టర్లు ఎగవేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలను ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు వేయాలంటే ఆ పొలం మార్కెట్ విలువలో పదో వంతు కన్వర్షన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత విస్తీర్ణంలో పదో వంతు స్థలం పార్కులకు, రోడ్లు, ఇతర అవసరాలకు వదలాలి. మిగిలిన స్థలంలోనే ప్లాట్లు వేసుకొని విక్రయించుకొనే అవకాశం ఉంటుంది. లేఅవుట్‌కు కూడా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఇందుకు రియల్టర్ ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్ కూడా కొంత చెల్లించాలి. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. దీంతో రియల్టర్లు పేట్రేగిపోతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కులకు కొందరు రాజకీయ నేతలు, ఉద్యోగులు అండగా నిలవడంతో అసైన్డ్ భూములను కూడా ఆక్రమించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు.
భూముల విలువకు అమాంతం రెక్కలు రావడంతో పంట పొలాలు కాస్తా ప్లాట్లుగా మారిపోతున్నాయి. రియల్టర్లు జేబులు నింపుకొనేందుకు కనీస అనుమతులు కూడా తీసుకోకుండా పొలాలను కొని ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి ప్రజలకు అంటగడుతున్నారు. నిబంధనలకు పాతర వేస్తున్నారు. తీరా అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా చిల్లు పడుతోంది.
ఈ అక్రమ లేఅవుట్లపై తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణను వివరణ కోరగా మండలంలో వేసిన లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలిస్తామన్నారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా వేసిన వెంచర్లు, వాటి వివరాలను సేకరించడంతోపాటు అనుమతులు లేకుండా ప్లాట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్‌వోసీలు లేకపోయినా అధికార పార్టీ ఆమోదం ఉంటే చాలు.. కన్వెర్షన్ కోసం పంచాయతీ అనుమతి లేకుండానే ప్లాట్లు వేసి భూముల అమ్మకాలు చేస్తున్నారు. కనీసం నివాస యోగ్యమైన ప్రాంతమా? సౌకర్యాలు ఉన్నాయా? వంటివి కూడా పరిశీలించడం లేదు. చీరాల ప్రాంతంలో వేస్తున్న మూడొంతుల లేఅవుట్లు కనీస అనుమతి కూడా తీసుకోనివే. అవగాహన లేని చాలామంది ప్లాట్లయితే కొనుగోలు చేస్తున్నారేగానీ, ఆ తర్వాత మున్సిపాలిటీతో పాటు పంచాయతీల నుంచి అనుమతులు రాకపోవడంతోపాటు బ్యాంక్‌లు ఇళ్లు కట్టుకోవడానికి రుణ సౌకర్యం కూడా కల్పించక పోవడంతో లబోదిబోఅంటున్నారు.


