చెరువులు, కుంటలు మాత్రమే నింపాలి తాగు అవసరాలకు వినియోగించాలి సాగర్ ప్రాజెక్ట్ ఈఈ రమేష్
విజయపురి సౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఈఈ రమేష్‌తోపాటు జెన్ కో అధికారులు మొదటి యూనిట్ ద్వారా 2 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈఈ రమేష్ మాట్లాడుతూ.. ఈ నీటిని సాగు అవసరాలకు వినియోగించరాదని పేర్కొన్నారు. కుడి కాలువ పరిధిలోని 442 చెరువులను నింపుకోవాలని, నీటిని వృథా చేయవద్దని సూచించారు. మొత్తం 8 టీఎంసీలు కుడి కాలువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి అవసరాలను బట్టి నీటి పరిమాణం పెంచనున్నట్లు వివరించారు. నీటి విడుదలతో నాగార్జున సాగర్ కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, సిబ్బంది గొల్లా వెంకటేశ్వర్లు, యాంపల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
రైతులు, ప్రజలు సహకరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఐదు జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కుడి కాలువ ద్వారా విడుదల చేసే నీటిని కేవలం తాగునీటి చెరువులను నింపడానికి మాత్రమే వినియోగించాలని లింగంగుంట్ల నాగార్జునసాగర్ సర్కిల్ ఎస్‌ఈ డి.వెంకటరత్నం బుధవారం పేర్కొన్నారు. సాగర్ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మొత్తం 442 తాగునీటి చెరువులను 3.31 టీఎంసీలతో నింపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని సాగు అవసరాలకు మళ్లించకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఐదు ప్రత్యేక బృందాలు కాలువ జీరో కి.మీ. నుంచి 137 కి.మీ. వరకు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.
కేఆర్‌ఎంబీ అనుమతులు లేకుండానే..
విజయపురిసౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అధికారులు కుడికాలువకు నీటిని బుధవారం విడుదల చేశారు. దీంతో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ అనుమతులు లేకుండానే సాగర్ కుడి కాలువకు ఆంధ్రా అధికారులు నీటిని విడుదల చేశారని ఆరోపిస్తూ తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు తాగునీటిని విడుదల చేశారు.


