పిడుగురాళ్ల: మెడికల్ కాలేజీ భవనంపై నుంచి కింద పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం పిడుగురాళ్ల మెడికల్ కళాశాల నూతన భవనం వద్ద జరిగింది. సంఘటనకు సబంధించి ఎస్‌ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు... బీహార్ రాష్ట్రానికి చెందిన రమాకాంత్ భష్వాన్ (35) రోజు మాదిరిగానే భవన నిర్మాణ పనులలో పాల్గొని మంగళవారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మెడికల్ కళాశాల భవనంపై నిద్రించాడు బుధవారం తెల్లవారుజామున నిద్ర లేస్తూ కాలుజారి ఐదో అంతస్తు నుంచి క్రింద పడ్డాడు. సంఘటనా స్థలంలోనే అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిపారు. తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


