రాజధాని నిర్మాణ పనుల కోసం భారీ టిప్పర్ల రాకపోకలతో ధ్వంసం నిత్యం నరకం చవిచూస్తున్న సామాన్య ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో విద్యార్థులతో వెళ్లే బస్సుల ప్రయాణం అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా అదే దుస్థితి
తాడికొండ అడ్డరోడ్డు – పెదపరిమి మార్గంలో ప్రజల నరకయాతన
ఇదిగో రాజధానిలో ప్రపంచస్థాయి వసతులు, రహదారులు నిర్మిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి పెదపరిమి వరకు ఉన్న కీలక మార్గం పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణ పనుల పేరుతో భారీ సంఖ్యలో మట్టి, ఇసుక టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు వందలాది భారీ వాహనాలు పరిమితికి మించిన లోడుతో దూసుకుపోతుండటంతో రహదారి మరింత దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాల నిరంతర రాకపోకల కారణంగా రహదారి పైపొర పూర్తిగా దెబ్బతిని కంకర తేలిపోయింది. కొద్దిరోజుల క్రితం వరకు ప్రయాణానికి అనుకూలంగా ఉన్న మార్గం ఇప్పుడు అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం
రాజధాని పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్, ఇతర ప్రైవేట్ కళాశాలలకు వెళ్లే వందలాది బస్సులు ప్రతిరోజూ ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. గుంతల్లోకి దిగిన బస్సులు ఒక్కసారిగా ఊగిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కళాశాల సమయాల్లో ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రహదారి పరిస్థితి కారణంగా బస్సులు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఏ గుంతలో వాహనం అదుపుతప్పుతుందో, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది.
పట్టించుకునే వారే కరువు
ఈ మార్గంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నిత్యం రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రహదారి దుస్థితిపై శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న పాలకులు, అదే రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో వాహనాల మరమ్మతుల ఖర్చులు పెరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకుండా మౌనం వహించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే మరమ్మతులు చేపట్టాలి
తాడికొండ అడ్డరోడ్డు–పెదపరిమి మార్గం రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారి కావడంతో దాని నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు, పరిమితికి మించిన లోడుతో ప్రయాణించే టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి, అవసరమైన చోట పూర్తిస్థాయి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


