బలహీనవర్గాల అభ్యున్నతే గౌతు లచ్చన్న ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాల అభ్యున్నతే గౌతు లచ్చన్న ధ్యేయం

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్లటౌన్‌: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సర్దార్‌ గౌతు లచ్చన్న ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం బాపట్ల పట్టణం కర్లపాలెం రోడ్డులోని లచ్చన విగ్రహానికి బీసీ సంఘాల నాయుకులతో కలసి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ గౌతు లచ్చన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ, సామాజిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడు అని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే సామాజిక అసమానతలు, పేదరికం, అణచివేత వంటి సమస్యలను ప్రత్యక్షంగా గమనించిన ఆయనలో ప్రజాసేవ పట్ల ఆసక్తి పెరిగిందని అన్నారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లచ్చన్న అనంతరం ప్రజా జీవితంలోకి ప్రవేశించి రైతులు, కార్మికులు, కూలీలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారని తెలిపారు. ముఖ్యంగా కల్లు గీత కార్మికులు, రైతులు, పేదలు సామాజికంగా వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపించిన ఆయన, ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత సంక్షేమ సంఘం చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ శివలీల, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిణి మాధవి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, పరిశా రమేష్‌, కార్పురపు రామారావు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement