పెరిగిన విషసర్పాల సంచారం జిల్లాలో 20 రోజుల్లో 60 మందికి కాటు బాపట్లలోనే 15 మంది బాధితులు రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం నాటు వైద్యంతో ప్రాణాలకే ముప్పు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు పడటంతోపాటు, అరకొరగా కాలువలకు నీరు రావడంతో తేమ వాతావరణంలో విషసర్పాల బెడద ఎక్కువైంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు గతంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం రైతులు ఎక్కువగా పొలాల్లో గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జూలై నుంచి నవంబర్ వరకు పాములు, ఇతర విషకీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. గడిచిన 20 రోజుల వ్యవధిలో బాపట్ల జిల్లాలో 60 మందికి పైగా పాముకాటుకు గురయ్యారు. వారిలో ఒక్క బాపట్లలోనే 15 మంది బాధితులు ఉన్నారు.
బాపట్ల టౌన్: దేశంలో సుమారు 250 జాతుల పాములు ఉండగా, వాటిలో 52 రకాలు మాత్రమే విషసర్పాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రాంతాల్లో మనిషికి హాని కలిగించే విషసర్పాలు మూడు రకాలుగా గుర్తించారు. వాటిలో త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర ఉన్నాయి. దీన్ని గుమ్మడివిత్తుల పింజెర, పొడపాము అని కూడా పిలుస్తారు. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. త్రాచుపాము కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర పాము కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ట పాములు కాటేసినా విషం ఉండదు. అయినప్పటికీ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించాలి. సముద్రపు పాములన్నీ విషపూరితాలే. మన ప్రాంతాల్లో ఆ తరహా పాముకాట్లు చాలా అరుదుగా ఉంటాయి.
ఎప్పుడు కాటేస్తుందంటే...
పొలంగట్లు, కాలువగట్లు, పశువుల పాకలు, గుబురుపొదలు, గడ్డివాములు, పాడుబడిన ఇళ్లు, గుట్టలుగా పేర్చిన పుల్లలు, పెంట దిబ్బల్లో విషసర్పాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆహారం కోసం బయటకు వచ్చి ఎలుకలు, కప్పలు, బల్లులు, తొండలను పట్టుకొని తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు కూడా అక్కడే ఎక్కువగా తిష్టవేసి ఉంటాయి. పాములకు చెవులు లేకపోయినప్పటికీ, వాటి శరీరం కిందిభాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్ద ప్రకంపనలను గ్రహిస్తాయి. వేడిరక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపిస్తే వెంటనే గుర్తించి కాటేస్తాయి. పాములకు ప్రాణభయం ఉన్నప్పుడు, ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వాటిని చంపేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే కాటేస్తాయి.
పాముకాటు ఆనవాళ్లు ఇలా..
విషసర్పాలు కాటువేసిన శరీరభాగంలో కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు ఉంటుంది. గొంతులో ఏదీ దిగని పరిస్థితి ఏర్పడుతుంది. నోటి ద్వారా సొంగ కారడంతోపాటు, కళ్లు మగతగా మారి, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. రెండు గాట్లు పడితే విషపూరితమైన పాము కాటేసినట్లుగా గుర్తించాలి. తాచుపాము కంటే కట్లపాము ప్రమాదకరం. రక్తపింజర కాటేస్తే విషం రక్తంలో చేరిపోతుంది. నోరు, ముక్కు ద్వారా రక్తం బయటకు వస్తుంది.
భయపడితేనే ప్రమాదం
పాము కాటేసిన తర్వాత విషం కంటే భయమే ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తికి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నందున తనకేమీ కాదన్న ధైర్యంతో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. పాముకాటుకు గురైన వ్యక్తికి ఎంత త్వరగా ఆధునిక వైద్యం అందిస్తే అంత మంచిది. పాము కరిచిన వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తులు ‘ఏమీ కాదు.. వైద్యం అందుబాటులోనే ఉంది’ అనే ధైర్యం చెబుతూ ఉండాలి. భయపడటం వలన గుండె వేగంగా కొట్టుకొని ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
పొలాల గట్ల మీద వెళ్లేటప్పుడు కర్రతో శబ్దం చేస్తూ నడవడం మంచిది. రాత్రిపూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లినప్పుడు టార్చిలైట్ తీసుకువెళ్లాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాములు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వెల్లుల్లి వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉండే చోట సమయానుకూలంగా వాటిని ఉపయోగించుకోవాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని నడిపించరాదు. పరుగులు పెట్టించకూడదు. ఆకుపసర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా తక్షణమే వైద్యశాలకు తీసుకెళ్లాలి.


