సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం త్రిపురాపురం కొండ, నకరికల్లు, చల్లగుండ్ల, చేజర్ల కొండల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అదేవిధంగా రాజుపాలెం, వీరవల్లిపాయ, చౌటపాయపాలెం మధ్యలో కొండపై మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. లక్ష్మీపురం తండాలో సైతం కొండను చెరబట్టి మట్టిని తవ్వుతూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కొండవీడుకు పోయే దారిలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు వీరి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలైన అమరావతి, అచ్చంపేట, తాడికొండ, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో మట్టి మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. రూ. కోట్ల ప్రజాధనాన్ని తమ జేబుల్లో టీడీపీ నేతలు వేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు వదిలేయడమే కాకుండా, వారికి పూర్తిగా సహకరిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఈ వాహనాల వల్ల రాజధాని ప్రాంతంతోపాటు గుంటూరు, విజయవాడ నగరాల్లో సైతం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగోంది. వీటి కింద పడి ఎందరో బలవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
ఇలా తరలింపు..
రాజధాని ప్రాంతంలోని నీరుకొండ వద్ద రిజర్వాయర్ పేరుతో అధికారికంగా భారీ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈ మట్టిని రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులకుగానీ, రాజధానిలోని లోతట్టు ప్రాంతాలకు గానీ తరలించాల్సి ఉంది. అక్రమార్కులు కొందరు అధికార పార్టీ నేతల అండతో పట్టపగలే అక్రమ దందాకు దిగుతున్నారు. ఈ మట్టిని కొల్లగొట్టి టిప్పర్ల ద్వారా గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంచర్లకు, నిర్మాణాలకు భారీ మొత్తంలో అమ్ముకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ. 7 వేల నుంచి రూ. 8 వేల వరకు విక్రయిస్తూ ఇప్పటికే రూ. 50 కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా తాడికొండ మండలం లచ్చన్నగుడిపాడు, సర్వే నంబర్ 93లో ఆరు ఎకరాల ప్రభుత్వ చెరువును పూర్తిగా తవ్వేశారు. మట్టి అమ్ముకుంటున్నప్పటికీ అధికారులు ఎవరూ అటువైపు తొంగిచూడని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మోతడకలో అసైన్డ్ భూములను సైతం వదలకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. పట్టపగలే అక్రమ రవాణాకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నిత్యం వీఐపీలు, వీవీఐపీలు, పోలీసులు, మైనింగ్ ఉన్నతాధికారులు పర్యటిస్తున్నప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోకపోవడం చూస్తుంటే మట్టి మాఫియాలో ఏ స్థాయి నాయకుల పాత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
అల్లుడి గిల్లుడు
గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట వంటి గ్రామాల్లో ఓ ఎమ్మెల్యే అల్లుడి ఆధ్వర్యంలో మట్టి మాఫియా యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములేకాకుండా అటవీ శాఖ భూములను సైతం చెరబెడుతూ రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వి రూ.కోట్లు జేబుల్లో వేసుకుంటున్న పరిస్థితి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ మట్టి దందా నడుస్తున్నా ఆపేవారే లేరు.


