బాపట్ల: జిల్లాలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో కుదిరిన ఎంఓయూల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంఓయూల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రూ.852.16 కోట్ల పెట్టుబడులతో 12 ప్రాజెక్టులు రానున్నాయని, వీటి ద్వారా 1,435 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని అధికారులు తెలిపారు. సూర్యలంక, చీరాల కేంద్రాలుగా పలు పర్యాటక ప్రాజెక్టులు, రిసార్టులు, బీచ్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు ప్రతిపాదించినట్లు వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ కేటాయింపులు, మౌలిక వసతులు, వివిధ శాఖల అనుమతులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వేటపాలెం మండలం నాయినిపల్లె, అమృతలూరు మండలం గోవాడ గ్రామాల్లో నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కుల పనుల పురోగతిని సమీక్షించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూర్యలంక తీరంలో ‘స్వదేశీ దర్శన్ 2.0’ కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. డీఆర్‌వో లవన్న, జిల్లా పర్యాటక అధికారి కె. బిన్హర్, జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ, ఏపీటీడీసీ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సైకిల్ ర్యాలీలో కలెక్టర్
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్లలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పురపాలక ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పెదనందిపాడు ఫ్లైఓవర్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ముందుగా మున్సిపల్ కమిషనర్ ఎం. హాసిని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులతో స్వాతంత్య్ర దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. 13న రేపల్లెలో, 14న చీరాలలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ హరికుమార్, డీఈఓ శ్రీనివాస్ సింగ్, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు.
సమాజాన్ని మేల్కొలిపే కథనాలు రావాలి
సమాజాన్ని మేల్కొలిపే వార్తా కథనాలను ప్రచురించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ వారి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్ – మీడియా వర్క్‌షాప్’ బాపట్లలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్తా కథనాల ప్రచురణ, చానల్స్‌లో ప్రసారమయ్యే వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం అతిథులను పీఐబీ అధికారులు సత్కరించారు. పీఐబీ రాష్ట్ర సంచాలకులు జి.సురేష్, పౌర సంబంధాల శాఖ ఓఎస్‌డీ డాక్టర్ అనిత, ఎల్‌డీఎం శివకృష్ణ, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి పి.వెంకట్రమణ, ఆర్‌డీఓ ఎ.హరి కుమార్, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్


