కొల్లూరు: పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీలలో అక్రమంగా నిల్వ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయీస్ అధికారుల కథనం మేరకు.. కొల్లూరు పోస్టాఫీసు ప్రాంతానికి చెందిన సామ సత్యనారాయణ రేపల్లె రోడ్డులోని విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద ఉన్న ఓ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని పీడీఎస్ బియ్యం భారీగా నిల్వ చేశాడు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి దారి మళ్లిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖాధికారులకు సమాచారం అందడంతో శుక్రవారం అర్ధరాత్రి కొల్లూరు వీఆర్‌ఓలతో కలసి జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించారు. గృహంలో 80 బస్తాలలో నిల్వ చేసిన 4 వేల కిలోలు (40 క్వింటాళ్ల) బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. జూన్ నెలలో నిందితుడి గృహంలో పౌరసరఫరాల శాఖాధికారులు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడంతోపాటు, నిత్యావసర సరకుల చట్టం ప్రకారం జేసీ కోర్టులో కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శనివారం కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలలో సివిల్ సప్లయీస్ డీటీ ఫణికుమార్, వీఆర్‌ఓలు నీలా రాంబాబు, రామారావులు ఉన్నారు.
తిరుమల: గుంటూరుకు చెందిన తుమ్మల ఆనంద్‌బాబు అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10,11,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.
బాపట్ల: పరిశుభ్రమైన పర్యాటక ప్రదేశాలు మరియు వారసత్వ ప్రదేశాలు అంశంపై సూర్యలంక బీచ్‌కు రాష్ట్ర స్థాయి ‘స్వచ్ఛ బీచ్ అవార్డు’ లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ బీచ్ అవార్డు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కి లభించడం సంతోషదాయకమని కలెక్టర్ అన్నారు. సూర్యలంక బీచ్ కు స్వచ్ఛ బీచ్ అవార్డు లభించడంపై జిల్లా పర్యాటక శాఖ అధికారి బెనహర్, క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్ శనివారం అభినందించారు. పర్యాటక శాఖ అధికారులు, బీచ్ సూపర్వైజర్, సిబ్బందితో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. విజయవాడలోని ఏ–వన్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానంలో సూర్యలంక బీచ్ కు అరుదైన గౌరవం దక్కిందన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. వారంలో ఒకరోజు బీచ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణకు ప్రణాళికల రూపొందించాలని ఆయన సూచించారు. బీచ్ సూపర్‌వైజర్లు, ఈవెంట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ఈ నెల 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 49, పల్నాడు జిల్లాలో 24 మద్యం షాపులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు ఫీజు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 8న కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించి షాపులు కేటాయిస్తామన్నారు.


