తాడికొండ: అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్ – మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి, ఉద్యానవన విభాగం అధికారులు శనివారం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో పర్యటించినట్లు సీఆర్డీయే అధికారులు తెలిపారు. రాజధానిలో ఉన్న చెరువులను ఆధునికీకరణ చేసే ఆలోచనతో అక్కడి నగరంలో పర్యటించారు. కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ శోభాయమానంగా అభివృద్ధి పరచిన వలన్‌కుళమ్ లేక్ పార్క్, పెరియాకుళయం లేక్, కురిచి కుళం లేక్, బ్లాక్ థండర్ రిసార్ట్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కోయంబత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ కట్టా రవితేజ్ ఏడీసీ బృందానికి స్వాగతం పలికారు. కోయంబత్తూరులో ప్రాచుర్యం పొందిన లేక్ పార్క్‌లు, టూరిజం రిసార్ట్‌లను క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాజధాని గ్రామాలలో ప్రస్తుతం ఉన్న చెరువుల అభివృద్ధి, శాఖమూరు సెంట్రల్ పార్కులో అభివృద్ధి చేస్తున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఈ పర్యటన దోహద పడుతుందన్నారు. పర్యటనలో ఏడీసీ హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్‌లు వీఎస్ ధర్మజ, బి.శ్రీనివాసులు, టూరిజం కన్సల్‌టెంట్ బి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


