పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు 50 సీట్లే కేటాయించిన ఎన్‌ఎంసీ ఫ్యాకల్టీ కొరత, సౌకర్యాల లేమితో వంద సీట్లు ఇవ్వలేమని స్పష్టీకరణ చంద్రబాబు సర్కారు తీరుతో తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులు తీవ్ర విమర్శల నేపథ్యంలో మరో 50 సీట్ల కోసం అప్పీల్‌కు వెళ్లిన వైద్యశాఖ మరోసారి తనిఖీ చేసి సౌకర్యాలు మెరుగుపడలేదని ఎన్‌ఎంసీ అసంతృప్తి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే 80 శాతానికిపైగా పనులు పూర్తి
సాక్షి, నరసరావుపేట: అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య విద్యతోపాటు సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. పేదింటి పిల్లలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య విద్య అందడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావంతో గత ప్రభుత్వంలో కళాశాల మంజూరు, స్థల సేకరణ, నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో 50 ఎకరాల స్థలం సేకరించి, పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో మిగిలిన పనులు పూర్తికానందున 50 సీట్లకే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. అప్పీలు చేసినా మళ్లీ వసతుల లేమిని ఎత్తిచూపింది.
ప్రైవేటుపరం చేయడంపైనే ధ్యాస
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేద్దామన్న ఆలోచనలతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆపేసి, నియామకాలు చేపట్టకుండా నిర్వీర్యం చేసేలా వ్యవహరించింది. ఫలితంగా ఈ ఏడాది 100 సీట్లతో మొదలవ్వాల్సిన మెడికల్ కళాశాల కేవలం 50 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికి పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు కేవలం 50 సీట్లే ఇవ్వగలమని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తేల్చిచెప్పింది. వంద సీట్ల అనుమతికి నిబంధనల ప్రకారం ఉండాల్సిన బోధనాసుపత్రి సౌకర్యాలు, కళాశాల, హాస్టళ్లు, అవసరమైన సిబ్బందిని చూపలేదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే 50 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 100 సీట్ల కోసం రాష్ట్ర వైద్యశాఖ అప్పీల్‌కు వెళ్లింది. అయితే మరోసారి తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందం కళాశాల సిబ్బంది, సౌకర్యాలను పరిశీలించింది. నిర్ణయం మాత్రం మార్చుకోలేదు.
అరకొరగానే వసతులు, సిబ్బంది
మెడికల్ కళాశాలలో మూడు బ్లాక్‌లు ఉండగా, ఇప్పటి వరకు ఒకటి మాత్రమే దాదాపుగా పూర్తి అయ్యింది. అందులో వసతులు కల్పించాల్సి ఉంది. మరో రెండు బ్లాక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. మొదటి ఏడాదికి అవసరమైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు సైతం ఇప్పటివరకు పూర్తి కాలేదు. రెండు హాస్టళ్లు, స్టాఫ్ వసతి బ్లాక్‌ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. తరగతులు ప్రారంభమైతే విద్యార్థుల వసతికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. రెండు ఓపీ బ్లాక్‌లు ఉండగా, ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఓపీ సేవలు ప్రారంభించారు. రోజుకు సుమారు ఐదారు వందల మంది వస్తున్నారు. మెడికల్ కళాశాలలో 17 మంది ప్రొఫెసర్లకు గాను 12 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు 27 మందికి గాను 24 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మందికి గాను 32 మంది, ట్యూటర్లు 24 మందికి గాను 16 మంది, ఎస్‌ఆర్‌లు 39 మందికి గాను 19 మంది మాత్రమే ఉన్నారు. పరికరాల సంగతి సరేసరి. అత్యవసర విభాగంలో సరిపడా పరికరాలు లేక ఐపీ సేవలు ప్రారంభం కాకుండా వాయిదా పడుతున్నాయి. రోగులకు అవసరమైన పడకలు, ఆపరేషన్ థియేటర్లు, శానిటరీ సదుపాయాలు సమకూరలేదు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అవసరమైన నిర్మాణాలు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తేనే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫలితాలు ప్రజలకు అందనున్నాయి. మరోసారి నేషనల్ మెడికల్ కమిషన్‌ను సంప్రదించి వంద సీట్ల సాధన కోసం కృషి చేస్తామని కళాశాల ఉన్నతాధికారులు తెలిపారు.


