పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : అంజుమన్ భూముల విషయంలో ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్‌కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే నసీర్ తాను ఒక మైనారిటీననే విషయాన్ని మరిచిపోయారని విమర్శించారు. మంగళగిరిలో ఉన్న అంజుమన్ భూములు 71.57 ఎకరాల భూమిని దోచుకునేందుకే ఐటీ పార్క్ అనే నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. ఇప్పటీకే ఎమ్మెల్యే నసీర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్, సీఈవోలను కలిసి ఈ సమస్యపై విన్నవించామని, వేలాది మంది ముస్లిం మైనారిటీలు సంతకాలు పెట్టి ఉన్నతాధికారులను కలిసినా, వారి మనోభావాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చిస్తామన్న ఎమ్మెల్యే ఇప్పటీ వరకు ఎవరితో చర్చించారో చెప్పాలన్నారు. అలాగే మల్లాయిపాలెంలోని 232 ఎకరాలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం అభివృద్ధి అనే పదాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజుమన్ భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


