దయాక్షేత్రం.. జయ సంకేతం | - | Sakshi
Sakshi News home page

దయాక్షేత్రం.. జయ సంకేతం

Mar 7 2026 8:10 AM | Updated on Mar 7 2026 8:10 AM

దయాక్షేత్రం.. జయ సంకేతం ● రెండో రోజు కొనసాగిన గుడారాల పండుగ ● నిరంతర ప్రార్థనతో విజయం వరిస్తుందన్న పాస్టర్‌ అబ్రహాం

లేమల్లెకు పోటెత్తిన క్రైస్తవ విశ్వాసులు

అమరావతి: పరిశుద్ధ ప్రభువైన ఏసు క్రీస్తు మన వెంట ఉండి నడిపించటానికి ప్రతి ఒక్కరూ నిరంతరం దైవ ప్రార్థన చేయాలని హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు, దైవజనులు అబ్రహాం అన్నారు. అమరావతి మండల పరిధిలోని లేమల్లెలో ఉన్న హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్‌ నిర్వహించే 49వ గుడారాల పండుగ రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. రాత్రి పూట ప్రార్థనలలో ఆయన ఆరాధికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాడైన మన బతుకులను మార్చుకోవటానికి పరిశుద్ధమైన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుని దర్శనం కలుగుతుందన్నారు. ఏసయ్యను నిష్కళంకమైన మనస్సుతో ప్రార్థిస్తే మంచి జరుగుతుందన్నారు. విశ్వాసుల జీవితాలలో సమస్యలు తొలగిపోవాలంటే ప్రభువు ఏసయ్యపై సంపూర్ణమైన నమ్మకం ఉంచాలన్నారు. గుడారాల పండుగ అంటే దేవుని వాక్యాల పండుగ, ఆరాధనల పండుగ, వర్తమానముల పండుగ అన్నారు. తొలుత హోసన్నా సేవకులు, సిస్టర్ల బృందం దేవుని స్తుతి గీతాలు ఆలపించారు. సండే స్కూల్‌ చిన్నారుల నృత్యాలు విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్‌ చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ మాట్లాడుతూ మానవునికి, దేవునికి మధ్య సంబంధం ఆరాధన మాత్రమే అన్నారు. దేవని కృప పొందాలంటే నిరంతర ఆరాధన పరిశుద్ధమైన మనస్సుతో చేయాలన్నారు. దేవుని పట్ల విశ్వాసులు భయభక్తులు కలిగి ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే కష్టాలు దరిచేరవన్నారు. రాత్రి ప్రార్థనలలో దైవజనులు రాజన్న ముగింపు ప్రార్థనలు చేశారు. గుడారాల పండుగల రెండో రోజు రాత్రి ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. దయాక్షేత్రం విశ్వాసులతో కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement