ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన

Aug 30 2025 7:58 AM | Updated on Aug 30 2025 12:03 PM

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరులోని ఏసీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన డీఎస్సీ–2025 సెలెక్టెడ్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో భర్తీ చేసేందుకు నిర్ణయించిన 1,143 పోస్టులతోపాటు జోనల్‌ స్థాయిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న మోడల్‌, ఆశ్రమ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోని 572 పీటీజీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులవారీగా అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది. గురువారం 930 మందికి సంబంధించి పరిశీలన పూర్తి కాగా, శుక్రవారం జోనల్‌స్థాయి పోస్టులకు ఎంపికై న అభ్యర్థులవి పరిశీలించారు. రెండు రోజుల వ్యవధిలో 1,650 మందికి పైగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఈ ప్రక్రియను ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, పరిశీలకురాలు పి.శైలజ, డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తంలు పర్యవేక్షించారు.

డీడీగా విధుల్లో చేరిన పాల్‌ సుధాకర్‌ 

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్‌గా బండి పాల్‌ సుధాకర్‌ శుక్రవారం విధుల్లో చేరారు. గుంటూరు ఆర్డీగా పనిచేస్తున్న గుర్రం శ్రీనివాసులురెడ్డి జేడీగా పదోన్నతి పొంది విజయవాడ డీఎంఈ కార్యాలయానికి బదిలీ కావడంతో ప్రభుత్వం పాల్‌ సుధాకర్‌ను డీడీగా నియమించింది. విధుల్లో చేరిన పాల్‌ సుధాకర్‌ ఆర్డీ డాక్టర్‌ శోభారాణిని కలిసి జాయినింగ్‌ రిపోర్టు అందజేశారు. డీడీగా విధుల్లో చేరిన పాల్‌ సుధాకర్‌ను కార్యాలయం సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్లు, పలువురు కార్యాలయ ఉద్యోగులు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది అభినందించారు. 

ఏషియన్‌ షూటింగ్‌ పోటీల్లో ముఖేష్‌కు పతకాల పంట 

గుంటూరువెస్ట్‌ (క్రీడలు): కజకిస్తాన్‌లోని షెమ్కెంట్‌లో జరుగుతున్న ఏషియన్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో గుంటూరుకు చెందిన షూటర్‌ నేలవల్లి ముఖేష్‌ పతకాల పంట పండించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌, 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ , 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగాల్లో 3 బంగారు పతకాలు, 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత్‌ జూనియర్‌ జట్టులో సభ్యుడైన ముఖేష్‌ కొన్ని సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును సైతం నెలకొల్పాడు. ఈ సందర్భంగా ముఖేష్‌ను రైఫిల్‌ అసోసియేషన్‌ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సలలిత్‌, రాజ్‌ కుమార్‌తోపాటు కేఎల్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ డీన్‌ హరికిషోర్‌లు అభినందించారు.

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

నరసరావుపేట ఈస్ట్‌: సతైనపల్లి రోడ్డు కోటబజార్‌లో పునర్నిర్మాణం జరుపుకుంటున్న వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పట్టణానికి చెందిన కొండేపాటి మంగేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించిన మంగేశ్వరరావు దంపతులు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కోవూరి శివశ్రీనుబాబు, వనమా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement