
సూర్యలంక బీచ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో బీచ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతిరోజూ వివిధ రకాల కార్యక్రమాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. బాపట్ల పట్టణంలోనూ, సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలలో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రామాపురం బీచ్‌లో కూడా మూడు రోజులపాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూర్యలంక బీచ్‌కు వస్తారని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలీసులకు సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అనంతరం వేడుకల ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను కలెక్టర్ జె వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడీ, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. సమావేశంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి గంగాధర్‌గౌడ్, రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లక్ష్మీప్రసన్న, బాపట్ల పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.