
దేశ భాషలందు తెలుగు లెస్స
బాపట్ల: దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు భాషను బతకనిద్దాం, గౌరవిద్దామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవహారిక తెలుగు భాష మరింత వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యమం చేసిన గొప్ప చారిత్రాత్మక వ్యక్తి రామ్మూర్తి అని ప్రశంసించారు. తెలుగు భాషకు బాపట్ల జిల్లా పుట్టినిల్లు అని పేర్కొన్నారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి చేసిన త్యాగాలు మరువలేనివని ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్ అన్నారు. తెలుగు భాషకు వెలుగు లాంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని బెటర్ ఫర్ బాపట్ల కార్యదర్శి పి సి సాయిబాబు అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల అర్బన్: ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా తెలుగు అత్యంత మధురమైనదని బాపట్ల ఆర్డీఓ పీ గ్లోరియా అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి, గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోదుగుల శ్రీరామ్‌రెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘తెలుగు తల్లి’ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, తహసీల్దార్ షేక్ సలీమా, మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి, చిత్రకారుడు జీవి, కళాశాల అధ్యాపకుడు హనుమాన్జి, నాయకులు కర్పూరపు రామారావు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి