
వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ దంపతులు
బాపట్లటౌన్: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపా రు. జిల్లా ఏఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో బుధవారం ఎస్పీ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ పండుగలను ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడంతో పోలీస్ సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యత మరింతగా పెంపొందుతాయన్నారు. ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉన్న పోలీస్ సిబ్బంది పండుగలను ఉత్సాహభరితంగా జరుపుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. వినాయక చవితి వంటి పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. జిల్లాలో వినాయక చవితి పందిర్లు/మండపాలను ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే డయల్ 100, 112 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఎస్‌బి సీఐ నారాయణ, రిజర్వ్ సీఐ మౌలుద్దీన్, బాపట్ల టౌన్ సీఐ ఆర్.రాంబాబు, రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, సర్కిల్ సీఐ బి.హరికృష్ణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.