నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ జాతర సాగింది. అభివృద్ధికి కూడా గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగించింది. సంక్షేమ పథకాలతో నాడు ఇంటింటా పండగ చేసుకున్న ప్రజానీకానికి నేడు కూటమి ప్రభుత్వం షాకులు మీద షాకులిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసగించింది. చంద్రబాబు కేవలం మాటలకే పరిమితం అయ్యారు.
బాపట్ల టౌన్ : కూటమి అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కొనసాగిస్తూ, సూపర్–6 పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అవేమీ అమలుకు నోచుకోలేదు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభమైనప్పటికీ అరకొరగానే అమలు జరిగిందనే విమర్శలు అధికంగానే వినిపిస్తున్నాయి. పింఛన్లు పెంచి ఇస్తున్నా.. లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గిస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మహిళలు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. పథకాలు అమలు కాకపోవడంపై అంతా చర్చించుకుంటూ గత పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
నాడు విప్లవాత్మక పథకాలు
ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలను చూసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా పలు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకే అందించాలని సంకల్పించారు. ఇందుకోసం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. వీరి ద్వారా పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు, మందులు ఇలా ఎన్నో సేవలను అందించారు. వైఎస్సార్‌సీపీ మార్క్ సుపరిపాలనకు కూటమి ప్రభుత్వ ఏడాదిలోనే స్వస్తి పలికింది. పేదలపై కక్ష కట్టి వలంటీర్ లాంటి వ్యవస్థను తొలగించింది. ప్రజలను ఇబ్బందుల పాలుచేసింది.
నాడు ప్రగతి పరుగులు
చీరాల ఓడరేవు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వరకు రూ.900 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే జిల్లాలో పర్యాటకం మరింత అభివృద్ది చెందనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం వద్ద రూ. 451 కోట్లతో వేగంగా హార్బర్ రెండవ ఫేజ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 500 బోట్లు నిలిపే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో 705 సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటికి ప్రోత్సాహకరంగా ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో రూ.110.69 కోట్లు రాయితీ అందించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గడపగడపకు మన ప్రభుత్వం కింద రూ.12 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. రూ.15 కోట్ల ఎంపీ నిధులతో ప్రభుత్వం సిమెంట్‌రోడ్లు, కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. రూ.885 కోట్లతో 4,750 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 2 వేలకుపైగా పూర్తయ్యాయి. రూ.6 కోట్లు వెచ్చించి రైతులకు రాయితీపై విత్తనాలను అందించారు. రూ.10 కోట్లతో ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందించారు. ఉద్యాన పంటలకు రూ.11 కోట్లు రాయితీలు, మత్స్యకార భరోసా కింద రూ.100 కోట్లు ఇచ్చారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద రూ. 20 కోట్లు, పశుగ్రాసం రాయితీ కింద రూ. 6 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కింద రెండు విడతల్లో రూ.1,040 కోట్లు కేటాయించి ఇప్పటివరకు 1,43,497 కుళాయిల ద్వారా నీరు అందించారు.
పథకం లబ్ధిదారుల అందించిన
సంఖ్య మొత్తం (రూ.కోట్లలో)
ఆసరా 2,76,290 953.37
అమ్మఒడి 1,16,019 489
వైఎస్సార్ చేయూత 85,846 439.13
జగనన్న వసతి దీవెన 30,611 29.16
జగనన్న విద్యా దీవెన 31,046 92.28
పింఛను కానుక 2,35,791 2,668
రైతు భరోసా 1,92,037 1,181
ఇన్‌పుట్ సబ్సిడీ 1,71,415 406.62
ఉచిత పంట బీమా 99,580 179.23
తుపాన్ పరిహారం 1,23,056 115.85
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 62,170 33.15
ఆరోగ్యశ్రీ 1,37,421 331.83
వైఎస్సార్ బీమా 2,376 31.52
సున్నా వడ్డీ (మహిళలు) 31,764 166.60
మత్స్యకార భరోసా 21,726 21.72
మత్స్యకార డీజిల్ సబ్సిడీ 2,663 4.54
ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ 2,620 76
గోరుముద్ద 76,975 0.31
జగనన్న విద్యాకానుక 1,11,520 26.77
వైఎస్సార్ సంపూర్ణ పోషణ 77,718 1.26
సంపూర్ణ మిశ్రమ దాణా 5,924 1.11
పశుగ్రాస విత్తనాల సరఫరా 10,768 2.27
పశుగ్రాస యంత్రాల పంపిణీ 111 15.8
పశువుల పంపిణీ 9,214 69.10
భవనం పేరు సంఖ్య వ్యయం (రూ.కోట్లలో)
గ్రామ సచివాలయాలు 401 160.04
రైతు భరోసా కేంద్రాలు 315 66.40
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు 343 58.48
బల్క్‌మిల్క్ సెంటర్లు 40 7.20
డిజిటల్ లైబ్రరీలు 128 20.49
నేడు వైద్యానికి నోచుకోని పేదలు
పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అందులో భాగంగా వైద్య సేవలను మరింత మెరుగు పరిచింది. జిల్లాలో రూ. 15 కోట్లు వెచ్చించి 7 కొత్త పీహెచ్‌సీలను నిర్మించింది. మరో రూ. 10 కోట్లు ఖర్చు చేసి 34 పీహెచ్‌సీలను ఆధునికీకరించింది. గడిచిన అయిదేళ్లలో 60 మంది కొత్త డాక్టర్లను, 43 మంది ఏఎన్‌ఎంలను రిక్రూట్ చేసింది. 343 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని బాపట్ల, చీరాల ఏరియా అసుపత్రులలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు విడతల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించారు. రెండు ఫేజ్‌లలో 2,69,495 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,223 మందికి వైద్యసేవలు అందించారు. జగనన్న కంటి వెలుగు ద్వారా 300 మందికి సర్జరీలు చేసి 29 వేల మందికి కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 3,49,767 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం రూ.550 కోట్లతో బాపట్లకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది. 55 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు వైద్యానికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.312.61 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాల వివరాలు
వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు
నాడు పథకాలతో కళకళ...
నేడు లబ్ధి అందక ప్రజలకు కష్టాలు
దారుణంగా మోసపోయామని
జిల్లా ప్రజల ఆవేదన
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సేవలను
ఇప్పటికీ మరువని జనం
రూ. వేల కోట్లతో నాడు జిల్లాలో
సంక్షేమం, అభివృద్ధి పరుగులు
ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా
తిరగాల్సిన దుస్థితి
పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు
లేక కన్నీరు కారుస్తున్న రైతులు
చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న మహిళలు
కూటమి సర్కారు ఏడాది పాలనపై
భగ్గుమంటున్న సామాన్యులు
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం


