అర్జీలను తక్షణమే పరిష్కరించండి
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను చీరాల డీఎస్పీ మొయిన్‌కు వివరించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
కొడుకు, కోడలు చంపాలని చూస్తున్నారు..
నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆరేళ్ల కిందట నా దగ్గరున్న రూ.5 లక్షల నగదు నా పెద్దకుమారుడు నాగేశ్వరరావు తీసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వమని అడిగినందుకుగాను నా కొడుకు, కోడలు లక్ష్మీప్రసన్నలు నన్ను చంపాలని చూస్తున్నారు. వారు ఏ క్షణంలో ఏం చేస్తారోనని భయంగా ఉంది. నా కుమార్తె బంగారం కూడా బలవంతంగా తీసుకొని మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
–కరేటి పద్మ, యడవూరు, వేమూరు మండలం
నరకం అనుభవిస్తున్నా ..
నాకు ఐదేళ్ల కిందట గ్రామానికి చెందిన అక్కల మణికంఠరెడ్డితో వివాహం జరిగింది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త ఏడాది కిందట చనిపోయాడు. అప్పటి నుంచి అత్త నాంచారమ్మ, మామ శివసుందర్‌రెడ్డిలు నన్ను ఇంటి నుంచి పంపించారు. నేను ప్రస్తుతం నా పుట్టింట్లోనే ఉంటున్నా. ముగ్గురు ఆడపిల్లలను పెట్టుకొని నరకం అనుభవిస్తున్నా, కనీసం నన్ను అత్త, మామలు పట్టించుకోవడం లేదు. ఇదేమని అడిగితే నీతో, నీ పిల్లలతో మాకు సంబంధం లేదని చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఊహించుకుంటేనే భయమేస్తుంది.
–అక్కల కుసుమకుమారి, కొత్తపాలెం, చీరాల మండలం
చీరాల డీఎస్పీ మొయిన్
అర్జీలు స్వీకరణ
అర్జీలను తక్షణమే పరిష్కరించండి
అర్జీలను తక్షణమే పరిష్కరించండి


