రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో చీరాలకు చెందిన కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పట్టణంలోని పేరాల గొల్లపాలెంలో నివాసముంటున్న కీర్తి వెంకటరాజు (45) బాపట్ల జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన స్నేహితుడు డీవీఎస్ గుప్తాతో కలిసి గుంటూరు నుంచి చీరాలకు కారులో వస్తుండగా పెదనందిపాడు సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గుప్తాకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు తరలించారు. వెంకటరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల సబ్ డివిజన్‌లో పలు పోలీసుస్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచిలో ఆయన పనిచేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంకటరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కానిస్టేబుల్ మరణవార్త తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల రోదనలు అందర్నీ కలచివేశాయి. అనంతరం పోలీసు లాంఛనాలతో వెంకటరాజు అంత్యక్రియలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి


