జీవన విధానాన్ని తెలిపేది జానపద సాహిత్యం
అద్దంకి రూరల్: పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలియజేసేది జానపద సాహిత్యమని ఉబ్బా దేవపాలన అన్నారు. శనివారం స్థానిక కాళికా సమేత కమఠేశ్వరస్వామి దేవస్థాన ఆవరణలో అద్దంకి లెవీ ప్రసాద్ అధ్యక్షతన సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. నిమ్మరాజు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉబ్బా దేవపాలన జానపద గేయాలు.. వైశిష్ట్యం అనే అంశంపై ప్రసంగించారు. జానపదుల నోళ్లలో నిలిచిన విశిష్ట సాహిత్యం జానపదం అన్నారు. కలుపు పాటలు, ఏతం పాటలు, శ్రమజీవుల పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసి హృదాయాలను రంజింప చేస్తాయన్నారు. కవి షేక్ మస్తాన్‌ను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్.రాఘవరెడ్డి, లక్కరాజు శ్రీనివాసరావు, గాడేపల్లి దివాకరదత్తు, పాలపర్తి జ్యోతిష్మతి, కొల్లా భువనేశ్వరి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
అమరావతి: మండల పరిధిలోని ఉంగుటూరు శివారులోని నెమలికల్లు రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పాస్టర్ మరణించగా అతడి భార్యకు తీవ్రగాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లెకు చెందిన హరనాథ్‌బాబు(50) పాస్టర్‌గా పనిచేస్తూ లేమల్లె మండెపూడిలలో చర్చిలు ఏర్పాటు చేసి ప్రార్థనలు చేస్తుంటారు. ఈక్రమంలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించటం కోసం శనివారం రాత్రి లేమల్లె గ్రామం నుంచి స్కూటీపై భార్య వెంకటరత్నంతో కలిసి హరనాథ్‌బాబు మండెపూడికి బయలు దేరారు. ఈక్రమంలో ఉంగుటూరు శివారు నెమలికల్లు రోడ్డులో మిరపకాయల బస్తాలు లోడ్ చేయటానికి ఆపి ఉన్న ట్రాక్టర్ ట్రక్ వెనుక భాగాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ప్రమాద శబ్ధానికి పొలంలో ఉన్న రైతులు వచ్చి అంబులెన్స్‌కు సమచారమిచ్చి అమరావతి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు తరలించారు. ఈసంఘటనలో పాస్టర్ హరనాథ్‌బాబు మరణించగా ఆయన భార్య వెంకటరత్నంకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హరనాథ్‌బాబుకు ఇద్దరు వివాహితులైన కుమారులు ఉన్నారు. అమరావతి పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


