ఘనంగా వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమం
గుంటూరు ఎడ్యుకేషన్: శ్యామలానగర్‌లోని శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థిని, ఉత్తరప్రదేశ్ గనులశాఖ కార్యదర్శి మాల శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృత్తి పరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ తాను చదివిన పాఠశాలకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ప్రత్యేక అతిథులుగా అనిల్ హర్నాథక, ఐపీఎస్ అధికారి అశ్విన్, మద్ది సుదర్శన్ పాణి, విజయ, ఝాన్సీలక్ష్మి, బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎన్.మంగాదేవి, సంయుక్త కార్యదర్శి జయశ్రీ , సీఏవో దుర్గా రఘురాం, రావెల సాంబశివరావు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీడీపీ జిల్లా అధికార
ప్రతినిధిపై కేసు నమోదు
న్యాయవాదిని దూషించిన చల్లా సుబ్బారావు
నరసరావుపేట టౌన్: న్యాయవాదిని దూషించిన టీడీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ తనను అసభ్య పరుష పదజాలంతో దూషించాడని వన్‌టౌన్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. గొడవపడుతూ తిట్టిన ఫోన్ ఆడియో రికార్డును అందజేశారు. ఇచ్చిన ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ కావడంతో న్యాయాధికారి నుంచి వచ్చిన అనుమతితో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు
రాజుపాలెం: ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని గణపవరంలో గల ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు, స్టాక్ డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. దుకాణాదారులు ఎరువులు అమ్మినవెంటనే ఈ–పాస్ తప్పని సరిగా చేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి పి.వెంకటనర్సయ్య ఉన్నారు.
ముగిసిన ‘కొలరిడో – నేషనల్ ఫెస్ట్’
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలోగల ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న కొలరిడో 2025 నేషనల్ ఫెస్ట్ శనివారంతో ముగిసింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 25 వేల మంది విద్యార్థులతో కళాశాల ప్రాంగణం కళకళలాడింది. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. టెక్నికల్ విభాగంలో వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకున్నారు. కోడింగ్ చాలెంజ్‌లు, ప్రాజెక్ట్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటారు. క్రీడా పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రముఖ హాస్య నటుడు షకలక శంకర్ అందించిన స్క్రిప్ట్ ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించింది. అతిథుల చేతుల మీదుగా మొత్తం రూ.5 లక్షల విలువైన నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ ఎం. జగదీష్, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె. కృష్ణప్రసాద్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, కల్చరల్ కమిటీ ఇన్‌చార్జి కన్వీనర్ రంగరాయచౌదరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
నకరికల్లు: కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించడంతోపాటు ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. నకరికల్లు పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రౌడీషీటర్‌ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు, కొట్లాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలవారీగా సిబ్బందిని నియమించి సమాచార సేకరణ వేగవంతం చేశామన్నారు.
ఘనంగా వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమం


