ఎస్టీల గృహ నిర్మాణాలకు ఆర్థికసాయం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులైన ఎస్టీల గృహ నిర్మాణాలకు ఆర్థికసాయం అందించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా బృందం గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి చర్చించింది. సమాజంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం గూడు కల్పించడం సంతోషదాయకమని కలెక్టర్ చెప్పారు. ఆర్థిక స్తోమత లేక చాలామంది అర్ధంతరంగా గృహ నిర్మాణాలను నిలిపివేసిన విషయాలను బృందంతో కలెక్టర్ చర్చించారు. అత్యంత నిరుపేదలైన ఎస్టీల గృహ నిర్మాణాలకు తమ సంస్థ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా డైరెక్టర్ జస్టిన్ జెబాకుమార్ తెలిపారు. బహుళ జాతి కార్పొరేట్ సంస్థల సహకారంతో ఎస్టీలకు సహాయం చేయాలని తమ సంస్థ నిర్ణయం తీసుకుందని వివరించారు. అనంతరం బాపట్ల పట్టణంలోని తూర్పు లేఅవుట్‌ను కలెక్టర్‌తో పాటు బృందం సభ్యులు సందర్శించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వై.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


