‘పేదోళ్లకిచ్చే సాయం ఎగ్గొడితే ఎలా సారూ..’
బాపట్ల శివారులోని సూర్యలంక రోడ్డులో ఉన్న నిరుపేద హనుమంతు నగర్ ఎస్టీ కాలనీఅది. పాతకాలపు ఇళ్లతో కాలనీ దర్శనం ఇస్తుంది. ఇదే కాలనీలో ఉంటున్న బొజ్జా గోవిందు, నారాయణమ్మలకు తొమ్మిదేళ్ల గంగ, లీలావతి కవలలతోపాటు ఐదు సంవత్సరాల ప్రజ్ఞేష్‌తో కలిపి ముగ్గురు సంతానం. చెమటోడ్చితేగానీ రెండు పూటలా కడుపు నింపుకోలేని స్థితి. పిల్లలకు నాయినమ్మను కాపలాగా పెట్టి చీకటితోడుగా కూలీపనులకు వెళ్లి పోయారు భార్యా భర్తలు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను వివరించి కన్నీళ్లు పెట్టింది వృద్ధురాలు సుబ్బరామమ్మ. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులిస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం పైసా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేసింది. గెలిచాక పేదోళ్లకిచ్చే సాయం ఎగ్గొడితే ఎలా సారూ అని కూటమి సర్కార్‌ను నిలదీస్తోంది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని డబ్బులిచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకివ్వరని కోపంగా ప్రశ్నించింది. ఇది మోసమేనని తేల్చి చెప్పింది.


