●తిరుచ్చిలో ఇంజినీరింగ్ చదువుతున్న వెంకటేష్ ●ఈతకు వెళ్లి మృతి
●అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
అద్దంకి: ఇంజినీరై తిరిగి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు చదువు పూర్తికాక మునుపే శవమై ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈత సరదా ఆ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. తిరుచ్చి నుంచి భౌతికకాయం మంగళవారం ఇంటికి చేరింది. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. మండలంలోని గోవాడ గ్రామానికి చెందిన మాదాల నాగేశ్వరరావు కుమారుడు వెంకటేశ్(20) పదో తరగతి వరకూ అద్దంకిలో, ఇంటర్ గుంటూరులో అభ్యసించాడు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని ధనలక్ష్మి శ్రీనివాసన్ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం చేరాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ తోటి విద్యార్థులు ఎనిమిది మందితో కలసి ఒకేగదిలో ఉంటున్నాడు. ప్రతి రోజూ కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం వారు నివసించే గదికి సమీపంలోని బావిలో ఈతకు దిగారు. ఒకసారి అందరూ ఈత వేసి ఒడ్డుకు చేరినా రెండోసారి వెంకటేశ్ ఈతకు దిగాడు. తాను వేసుకున్న గాలి పైపు పక్కకు తొలగడంతో మునకేశాడు. గమనించిన తోటి విద్యార్థులు కాపాడాలని ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కాపాడటానికి ప్రయత్నించిన మరో యువకుడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్, వెంకటేశ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయం తోటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న బంధువులు తిరుచ్చి వెళ్లి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి మంగళవారం అంత్య క్రియలు నిర్వహించారు. నాగేశ్వరరావుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు
చీరాల రూరల్: కుల, మతాలకతీతంగా పరిపాలన చేస్తామని భారత రాజ్యంగంపై ప్రమాణంచేసి ఉపముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కల్యాణ్ ఆవిధంగా పరిపాలన చేయడంలేదని, దళితులు, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతానని మాట్లాడుతున్నారని అది మంచి పద్ధతి కాదని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలు లైంగిక వేధింపులకు గురై సాంఘిక బహిష్కరణ జరిగినా, వారిపై దాడులు జరిగినా పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పాటిస్తానని బహిరంగంగా చెపుతూ ఇతర మతాలను కించపరచే విధంగా మాట్లాడడం తగదన్నారు. అన్ని కులాలవారు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలవగలరు కానీ ఒక కులం వారు ఓట్లువేస్తే గెలలేరనే విషయాన్ని పవన్‌కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర నాయకుడు కొండమూరి ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, మేరిగ రమేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు.
స్వగ్రామానికి చేరిన విద్యార్థి మృతదేహం
స్వగ్రామానికి చేరిన విద్యార్థి మృతదేహం


