ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
● చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్
చీరాల: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గిరిజన ప్రజలు, విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి మూడో శుక్రవారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చీరాల నియోజకవర్గంలో భూములకు సంబంధించి ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలు, పెన్షన్ల గురించి, పోలీస్‌శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. వాడరేవు పంచాయతీ సిద్దూర్ కాలనీలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలను ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రజలు కోరారన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చీరాల వైకుంఠపురం గేటు వద్ద గల శ్మశానస్థలంలో కొంత మంది గిరిజనులు నివాసం ఉంటున్నారని, వారికి గృహ నిర్మాణ సదుపాయా లు కల్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ చీరాల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమానికి జిల్లా అధికారులు రావడం వలన సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. నియోజకవర్గంలో ఖాళీ భూములను గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు అందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రాధామాధవి, డీఎంహెచ్‌ఓ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరాా, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి పాల్గొన్నారు.


