రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే దాడులు
వినుకొండ: దేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆళ్ల సాంబిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎం.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నేతలు నేరపూరిత, ఘర్షణ వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే తాము రెడ్‌బుక్ రాజ్యాంగం అంటున్నామన్నారు. ఇటీవల బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో ఆళ్ల సాంబిరెడ్డి, ఆళ్ల పాపిరెడ్డిలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని, వారి ఇళ్లపై కూడా దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనను స్థానిక టీడీపీ నేతలు కూడా ఖండించారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏ రాజ్యాంగంలో ఉందని, గ్రామాల్లో భావప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా మోటారు సైకిళ్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రం కనిపిస్తే ఆ బళ్లు ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడం కూటమి నేతలకు పరిపాటిగా మారిందన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను గుర్తించి కేసులు నమోదు చేయడం, వేధించడంతో పాటు ఇరువర్గాల ఘర్షణలో కూడా ఒక వర్గం వారికి స్టేషన్ బెయిల్, మరో వర్గం వారిపై 307కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది రెడ్‌బుక్ రాజ్యాంగం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అన్నారు.
గ్రామాల్లో కక్షలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం...
వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కక్షాపూరిత వాతావరణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, చిన్నచిన్న ఘర్షణల్లో కూడా పోలీసులు తలదూర్చి కేసులు నమోదు చేయడం తాము ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితుడు సాంబిరెడ్డి మాట్లాడుతూ అకారణంగా తమ కుటుంబంపై దాడి చేసి తన జేబులో సెల్‌ఫోన్ లాక్కొన్నారన్నారు. అదేమని ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై మూకుమ్మడిగా దాడికి తన కన్నతల్లిపై కూడా దాడి చేశారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన గెలుపు కోసం పనిచేశానని, తనపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు వక్రీకరించడం బాధాకరమని అన్నారు. పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షుడు బత్తి గురవయ్య, వినుకొండ అధ్యక్షులు దండు చెన్నయ్య, మన్నెయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోటారు సైకిళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ పెట్టుకున్నా తట్టుకోలేక పోతున్నారు ఉద్దేశపూర్వకంగా దాడులు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్


