బాపట్లటౌన్: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడూరి ఏకాంభీశ్వరబాబు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే అందజేయాలని కోరారు. జూలై 1, 2018, జనవరి 1, 2019 నాటి డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వీటితోపాటు మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ అందజేయాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల వారికి 10 శాతం, 75 ఏళ్ల వారికి 15 శాతం, 80 ఏళ్ల వారికి 20 శాతంగా పునరుద్ధరణ చేయాలని సూచించారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యం అందించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తాలూకా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వై.వి.నరసింహారావు, కార్యదర్శి పి.వి.ప్రసాద్, కోశాధికారి సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ ఎన్. సిద్దయ్య, కోశాధికారి ఎం.వి బ్రహ్మం పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన