
నీట మునిగిన చీరాల–వేటపాలెం ప్రధాన రహదారి
చీరాల/వేటపాలెం: మిచాంగ్ తుఫాన్‌కు చీరాల ప్రాంతం అతలాకుతలం అయ్యింది. జనజీవనం స్తంభించింది. తుఫాన్ బాపట్ల వద్ద తీరం దాటే సమయంలో 110–120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చీరాల, వేటపాలెం, అద్దంకి, పర్చూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా వేరుశనగ, శనగ పంటలు పూర్తిగా మునిగాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా లేకపోవడంతో చీరాల ప్రాంతం అంధకారంలో ఉంది. సముద్రం సుమారు 100 అడుగుల మేర ముందుకు వచ్చింది. సుమారు 15 మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. దీంతో తీరం కోతకు గురైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ వాడరేవు తీర ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కావూరివారిపాలెం, వాడరేవులో పూరిగుడిసెలు కూలాయి. మత్య్సకారులు బోట్లను, వలలను ఒడ్డుకు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి నష్టం లేనప్పటికీ పరిస్థితి గందరగోళంగా మారింది. వర్షం కారణంగా మొక్కజొన్న పంట దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని విద్యుత్ వైర్లపై పడిన చెట్టు కొమ్మలను తొలగించారు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన
ఎమ్మెల్యే కరణం
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయం అయిన పట్టణంలోని శివారు ప్రాంతాలను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. సెయింట్ ఆన్స్ స్కూలు సమీపంలోని అరవ కాలనీని సందర్శించి వారికి స్కూల్‌లో పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దండుబాట ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
వేటపాలెం మండలంలో
1720 ఎకరాల్లో పంటలకు నష్టం
మిచాంగ్ తుఫాన్ మండలంలో బీభత్సం సృష్టించింది. మండలంలోని ఆణుమల్లిపేటలో విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. అంతేకాకుండా చీరాల–వేటపాలెం ప్రధాన రహదారిలో మోకాలి లోతు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విదు్‌య్‌త్‌శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మండలంలో రామాపురం వద్ద గల సీఈసీ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టి సుబ్బయ్యపాలెంలోని ప్రభుత్వ పాఠశాల, ఊటుకూరి సుబ్బయ్యపాలెం, బచ్చులవారిపాలెం, రామచంద్రాపురం కఠారివారిపాలెంలో ఏర్పాటుచేసిన తుఫాన్ షెల్టర్లలో అన్ని ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంత గ్రామాలను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సందర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మండల పరిధిలో 1720 ఎకరాల్లో సాగుచేసిన వివిధ పంట పొలాల్లో నష్టం వాటిల్లిందని చెప్పారు. వరి 700, వేరుశనగ 400, మినుము 500, మొక్కజొన్న 100, కూరగాయల పంటలు 20 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. అద్దంకి నియోజకవర్గంలో దాదాపు 2600 ఎకరాల పైచిలుకు పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
స్తంభించిన రాకపోకలు
పర్చూరు నియోజకవర్గం మార్టూరులో గుంటూరు–చైన్నె వెళ్లే వాహనాలను స్థానిక రాజుపాలెం జంక్షన్‌లోని రెస్ట్ ఏరియాలో సుమారు 400 వాహనాలు అధికారులు నిలిపివేశారు. పర్చూరు నియోజకర్గంలో వంకాయలపాడు వద్ద వాగు ఏడు అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో పర్చూరు– ఇంకొల్లు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్చూరు–మార్టూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వాడరేవు తీర ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ రంజిత్‌బాషా, ఎస్పీ జిందాల్

Comments
Please login to add a commentAdd a comment