
స్పెషల్ కలెక్టర్ పి.ఉమాదేవి
మేదరమెట్ల: ఓటర్ల జాబితా తయారీలో బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ కలెక్టర్ పి.ఉమాదేవి పేర్కొన్నారు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో 275, 276, 277 నెంబర్లు గల పోలింగ్ బూత్‌లను స్పెషల్ కలెక్టర్ శనివారం పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు మరణించిన వారి ఓట్లను తొలగించడం చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు ఉన్నా వాటిని వెంటనే సరిచేయించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల, డీటీ మెహతాజ్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
జే.పంగులూరు: డ్రైవర్ మద్యం తాగి ట్రాక్టర్ నడపడంతో బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రేణింగవరం గ్రామంలో శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన ముచ్చు వెంకటేశ్వర్లు కుమారుడు ముచ్చు సాయి (20) గ్రామ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డ్యూటీ చేసిన సాయి శనివారం ఉదయం అలవలపాడు వెళ్లేందుకు సుబాబుల్ పొట్టు కోసం వెళ్తున్న ట్రాక్టర్ ఎక్కాడు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం తాగి ఉండటంతో ట్రాక్టర్ అదుపులో లేకుండా నడుపుతున్నాడు. ట్రాక్టర్ ఫ్లైఓవర్ దాటి సర్వీస్ రోడ్లోకి వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఇది గమనించిన సాయి ముందుగానే ట్రాక్టర్ నుంచి కిందకి దూకాడు. కిందపడిన సాయి మీదుగా ట్రాక్టర్ ట్రాలీ వెళ్లడంతో సాయికి కనపడని గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కొరిశపాడు 108 సిబ్బంది క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ల సూచన మేరకు ఒంగోలు వెంకటరమణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి మరణించాడు. మృతుడికి వివాహం కాలేదు. రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
