
బాధితుల సమస్య వింటున్న ఎస్పీ వకుల్ జిందాల్
జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్
బాపట్లటౌన్: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 73 మంది బాధితులు ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలసి తమ సమస్యలు వివరించారు. తొలుత ఎస్పీ బాధితుల సమస్యలు క్షుణంగా విని, ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఎస్పీ వకుల్‌జిందాల్ మాట్లాడుతూ స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదేపదే పోలీసుస్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండకూడదని, పోలీస్ అధికారులే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఆ ప్రదేశంలో విచారించి సకాలంలో చట్టపరిధిలో ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.మహేష్, స్పందన సీఐ వి.మాలకొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు.