గుర్రంకొండ: పడమటి ప్రాంత పల్లె సీమలు ఇప్పుడు రంగురంగుల పూల తివాచీ పరుచుకున్నట్లుగా కనువిందు చేస్తున్నాయి. మూస పద్ధతికి స్వస్తి పలుకుతూ ఇక్కడి రైతులు కొత్తరకం హైబ్రిడ్ పూలసాగుపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఆకర్షణీయమైన రంగుల చామంతి, మ్యారీగోల్డ్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ లాభాల బాట పడుతున్నారు. కార్తీక మాసంలో విరగబూసిన ఈ విభిన్న వర్ణాల పూలతోటలు విదేశీ ఉద్యానవనాలను తలపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
కనువిందు చేస్తున్న విభిన్న వర్ణాల
చామంతులు..
పడమటి ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో రైతులు ఇప్పటివరకు సాగు చేయని సరికొత్త పూలరకాలను పరిచయం చేస్తున్నారు. సాధారణంగా ఇక్కడ బంతి, నాటు చామంతి మాత్రమే పండించేవారు. అయితే, ఈ ఏడాది నాటు చామంతిని పోలి ఉండే హైబ్రిడ్ రకాలతో పాటు హైబ్రిడ్ మ్యారీగోల్డ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హైబ్రిడ్ చామంతిలో పసుపు, తెలుపు రంగులతో పాటు మొదటిసారిగా గులాబీ, ఆరెంజ్, కుంకుమ రంగు పూలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు అచ్చం నాటు చామంతిలా కనిపించే శ్రీబుల్లెట్ చామంతిశ్రీ, సువాసనలు వెదజల్లే శ్రీసెంట్ వైట్‌శ్రీ, శ్రీసెంట్ ఎల్లోశ్రీరకాలను కూడా పండిస్తున్నారు. ఒకే పువ్వులో పసుపు–కుంకుమ, తెలుపు–పసుపు రంగులు కలగలిసి ఉండే ద్వంద్వ వర్ణాల చామంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సాగు ఖర్చు.. ఆశాజనకంగా
దిగుబడి, ధరలు!
ఎకరం పొలంలో 10 వేల నుంచి 12 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. దుక్కులు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చు కలుపుకొంటే ఎకరం హైబ్రిడ్ చామంతి సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు, మ్యారీగోల్డ్ రకాలకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పూల రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.110 వరకు పలుకుతోంది. గులాబీ రంగు హైబ్రిడ్ చామంతి కిలో రూ.60–80, మ్యారీగోల్డ్ రూ.50, మూడు రంగులు కలగలిసిన ప్రత్యేక రకం పూలు కిలో రూ.120 వరకు ధర పలుకుతున్నాయి. ఇటీవలి చిరుజల్లులతో ధరలు కాస్త తగ్గినా, వాతావరణం తెరిపినివ్వగానే మళ్లీ పుంజుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు..
ఇక్కడ పండే రంగురంగుల పూలకు మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా, గుంటూరు, విజయవాడలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
గులాబీ, కుంకుమ, ద్వంద్వ వర్ణాలతో కనువిందు చేస్తున్న చామంతులు
ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి.. ఐదు టన్నుల వరకు ఆశాజనక దిగుబడి
స్థానికంగానే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు జోరుగా ఎగుమతులు


