రొంపిచెర్ల: పాము కాటుతో మహిళ కౌలు రైతు మృతి చెందిన సంఘటన రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు రమేష్ నాయుడు రొంపిచెర్ల గ్రామ పంచాయతీకి చెందిన జక్కా సుబ్బయ్య శెట్టి వ్యవసాయ భూమి కౌలుకు చేసుకుంటున్నారు. ప్రేమనగర్ దగ్గర ఉన్న వ్యవసాయ పొలంలో మిరప పంట సాగు చేశారు. సోమవారం రొంపిచెర్ల వారపు సంతలో మిరప కాయలు అమ్మడానికి రైతు రమేష్ నాయుడు భార్య మహిళా రైతు లక్ష్మీ మిరప కాయలు కోస్తుండగా పాము కాటు వేసింది. ఈ విషయం భర్త రమేష్ నాయుడుకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన లక్ష్మీని చికిత్స కోసం రొంపిచెర్లకు తరలిస్తుండగా మృతి చెందింది. డాక్టర్ పరిశీలించి మృతి చెందినట్లు దృవీకరించారు. మృతురాలికి భర్తతోపాటు కుమారై, కుమారుడు ఉన్నారు.
ఐదుగురు వైఎస్సార్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు
వేంపల్లె : వేంపల్లె మండలంలోని కుప్పాలపల్లె గ్రామానికి చెందిన ఐదుగురు వైఎస్సార్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సీఐ నరసిఃహులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుప్పాలపల్లెకు చెందిన టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థి రామతులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రామతులసిని బెదిరించినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి సుజాతను బెదిరించినా.. నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవడంతో రామతులసి రివర్స్ కేసు నమోదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


