అద్దె సాకు..బాలలకు షాకు! | - | Sakshi
Sakshi News home page

అద్దె సాకు..బాలలకు షాకు!

Nov 29 2026 12:32 AM | Updated on Nov 29 2026 12:32 AM

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఉండాల్సిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) కార్యాలయాన్ని తిరిగి పాత జిల్లా కేంద్రమైన రాయచోటికి తరలించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిబంధనల ప్రకారం జిల్లా హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాల్సిన ఈ కీలక కార్యాలయాన్ని మూడు నెలల క్రితం రాయచోటికి మార్చడంతో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

అద్దె భవనాల సాకు.. స్థానికుల ఆగ్రహం

గతంలో మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని అమ్మచెరువు మిట్టలో ఈ కార్యాలయం కొనసాగేది. అయితే, పట్టణంలో కార్యాలయ నిర్వహణకు అద్దె భవనాలు లభించలేదనే సాకుతో దీనిని రాయచోటికి తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు కారణంగా సిబ్బంది కూడా విధులకు సక్రమంగా హాజరుకాలేకపోతున్నారని సమాచారం. మరోవైపు, ఒక్క రూపాయి అద్దె చెల్లించే పనిలేకుండా స్థానిక బి.టి. కళాశాల ప్రాంగణంలోనే పలు ప్రభుత్వ భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని, అద్దె భవనాల సమస్య అనేది కేవలం సాకు మాత్రమేనని స్థానికులు మండిపడుతున్నారు.

బాధితులకు తిప్పలు.. సమన్వయ లోపం

జిల్లా కేంద్రంలో బాలల సంరక్షణ ఫిర్యాదులు, కేసుల పరిష్కారం, చైల్డ్‌లైన్‌, దత్తత, బాల కార్మిక నిర్మూలన వంటి కీలక సేవలు అందుబాటులో ఉండాలి. కానీ, డీసీపీయూ కార్యాలయం సుదూర ప్రాంతమైన రాయచోటికి తరలిపోవడంతో బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నారు. దీనికితోడు కోర్టు వ్యవహారాలు, పోలీసు, వైద్య శాఖలతో అధికారుల సమన్వయానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లెలోనే డీసీపీయూ కార్యాలయాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతోనే మార్చాం: ఐసీడీఎస్‌ పీడీ

భవనాల కొరత, నిర్వహణ సమస్యల కారణంగానే జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీసీపీయూ కార్యాలయాన్ని రాయచోటికి మార్చాల్సి వచ్చిందని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హైమావతి వివరణ ఇచ్చారు.

ఖాళీ భవనాలున్నా పట్టించుకోని వైనం..

రాయచోటికి డీసీపీయూ తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement