●ఎన్‌హెచ్‌–340 పై ప్రమాదకరంగా రవాణా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం! | - | Sakshi
Sakshi News home page

●ఎన్‌హెచ్‌–340 పై ప్రమాదకరంగా రవాణా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

●ఎన్‌హెచ్‌–340 పై ప్రమాదకరంగా రవాణా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన గుర్రంకొండ మీదుగా గ్రానైట్‌ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో గ్రానైట్‌ మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతోంది. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

నకిలీ పర్మిట్లతో సరిహద్దులు దాటిస్తున్న మాఫియా..

రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో గ్రానైట్‌ క్వారీలు అధికంగా ఉన్నాయి. గుర్రంకొండ మండలం అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉండటంతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ప్రధాన రహదారిగా ఎంచుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేందుకు మాఫియా సొంతంగా కంప్యూటర్ల ద్వారా నకిలీ పర్మిట్లు, సీ–ఫారాలు, వేబిల్లులను సృష్టించి సరిహద్దులు దాటిస్తూ విదేశాలకు సైతం తరలిస్తోంది. గతంలో గుర్రంకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు లారీలను సీజ్‌ చేయగా, ఇటీవల సరైన రికార్డులు లేవంటూ కర్ణాటక సరిహద్దు పోలీసులు నాలుగు లారీలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

తనిఖీల నుంచి తప్పించుకునేందుకు రాత్రివేళల్లో దందా..

పగటి పూట వెళితే అనుమానం కలుగుతుందనే ఉద్దేశంతో అక్రమార్కులు రాత్రివేళలను ఎంచుకున్నారు. రాత్రి అయితే అధికారుల నిఘా తక్కువగా ఉంటుందని భావించి, గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ రాత్రిళ్లు గుర్రంకొండ మీదుగా నాలుగు నుంచి ఐదు భారీ గ్రానైట్‌ లారీలు సరిహద్దులు దాటుతుండటం గమనార్హం.

మామూళ్ల మత్తులో అధికారులు..

స్టేషన్ల వద్ద ‘రైట్‌ రైట్‌’!

రాయచోటి నుంచి కర్ణాటక సరిహద్దులు దాటే వరకు ఉన్న ఏ ఒక్క పోలీస్‌ స్టేషన్‌ వద్ద గానీ, చెక్‌పోస్టుల వద్ద గానీ ఈ లారీలను ఆపి రికార్డులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎక్కడైనా ఆపినా పాత రికార్డులు, వేబిల్లులు చూపిస్తూ యథేచ్ఛగా వెళ్లిపోతున్నారు. గ్రానైట్‌ యజమానులు సంబంధిత అధికారులను ప్రసన్నం చేసుకుని నెలవారీ మామూళ్లు ముట్టజెబుతుండటంతోనే పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద అందరూ ‘రైట్‌ రైట్‌’ చెబుతూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం భారీ గ్రానైట్‌ బండరాళ్లను లారీల్లో లోడ్‌ చేసిన తర్వాత ముందుగా తాళ్లతో గట్టిగా కట్టాలి. ఆపై బండరాళ్లపై ప్లాస్టిక్‌ పట్టా చుట్టి, మరోసారి తాళ్లతో పకడ్బందీగా బిగించి అవి జారిపడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే క్వారీ యజమానులు ఇవేవీ పట్టించుకోకుండా బండరాళ్లను అలాగే లారీల్లో వేసి, కనీసం తాళ్లు కూడా కట్టకుండా తరలిస్తున్నారు. నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఎన్‌హెచ్‌–340 జాతీయ రహదారిపై, గుర్రంకొండ జనావాసాల మధ్య నుంచే ఈ లారీలు అతివేగంగా వెళ్తుండటం పట్ల స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున బండరాళ్లు జారిపడితే భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల గండి పడుతున్నా, ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారినా పట్టించుకోని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement