వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు! | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు!

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

● నామినేషన్లు వెనక్కి తీసుకోకుంటే

లోపలేస్తానంటూ ఫోన్లలో బెదిరింపులు

● టీడీపీ ఏజెంట్‌లా పనిచేస్తున్న

కలికిరి సీఐ సాయి ప్రసాద్‌

● కలెక్టర్‌, ఎస్పీ, ఎన్నికల కమిషన్‌కువైఎస్సార్‌సీపీ నేతల వరుస ఫిర్యాదులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగేలా చూస్తూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి అధికార పార్టీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కలికిరి అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సాయి ప్రసాద్‌ తన ఖాకీ బాధ్యతలను విస్మరించి, అధికార టీడీపీ పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ రెడ్డికి దాసోహమయ్యారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోటీలో ఉండకూడదన్న దురుద్దేశంతో సీఐ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. గ్రామ స్థాయిలోని వైఎస్సార్‌సీపీ నేతలకు, నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులకు గత రెండు రోజులుగా వరుసగా ఫోన్లు చేస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు.. నామినేషన్లు వెనక్కి తీసుకోకుంటే అక్రమ కేసులు పెట్టి లోపలేస్తా’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేస్తున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి స్వయంగా బెదిరింపులకు దిగుతుండటంపై స్థానిక ప్రజానీకం నివ్వెరపోతోంది.

144 సెక్షన్‌ ఉన్నా టీడీపీ మూకలకు అండ..

శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఐ సాయి ప్రసాద్‌, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియలో తన వంతు పాత్ర పోషించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలోనూ కలికిరి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించివేశారు. అక్కడ 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ టీడీపీ మూకల గుంపులను చెదరగొట్టకుండా సీఐ ప్రేక్షకపాత్ర వహించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులకు మాత్రం ముందస్తు నోటీసులు జారీ చేసి, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే నామినేషన్లకు రావాలని హుకుం జారీ చేశారు. ప్రతిపక్ష నాయకులను అదుపు చేయడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ.. నామినేషన్లను అడ్డుకున్న టీడీపీ మూకలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని ఆరోపణలు ఉన్నాయి. సీఐ సాయి ప్రసాద్‌ ఏకపక్ష వ్యవహారశైలి, బెదిరింపులపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు చేశారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సదరు సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement