● ప్రకృతి అన్వేషణలో
నాయకత్వ లక్షణాల పెంపు
● భారత్ స్కౌట్స్ గైడ్స్ ప్రత్యేక కార్యక్రమం
మదనపల్లె సిటీ: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బేసిక్ స్కౌట్స్ మాస్టర్, అడ్వాన్స్‌డ్ స్కౌట్ మాస్టర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక అనపగుట్ట ప్రాంతంలో ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. చారిత్రక, అధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన అనపగుట్ట ప్రాంతంలో నిర్వహించిన టెక్కింగ్ ద్వారా ఉపాధ్యాయులు పర్వతారోహణలో పాల్గొని సాహసోపేతమైన అనుభూతిని పొందారు. కోర్స్ లీడర్లు కమల్‌కన్నన్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ మాట్లాడుతూ స్కౌటింగ్‌లో ట్రెక్కింగ్ అనేది శారీరక దృఢత్వం, మానసిక సైర్థ్యం, ఆత్మవిశ్వాసం, సమయపాలన,బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉత్తమ అభ్యాస ప్రక్రియ అని తెలిపారు. శిక్షణ పొందుతున్న స్కౌట్ మాస్టర్లు భవిష్యత్తులో తమ పాఠశాలల విద్యార్థులకు ఇటువంటి సాహసోపేత కార్యక్రమాలను పరిచయ చేసి వారిలో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, సేవాభావం, ప్రకృతి ప్రేమ, నాయకత్వ లక్షణాలను పెంపొదించాలని సూచించారు. జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ చంద్రశేఖర్, హర్షవర్ధన్‌రెడ్డి, రిసోర్సుపర్సన్లు మోహన్‌బాబు, ప్రసాద్, మహమ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


