బి.కొత్తకోట: జగనన్న పాలనలో బి.కొత్తకోట నగర పంచాయతీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఇచ్చాం..అందుకనే గర్వంగా ఓట్లు అడుగుతున్నామని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ అన్నారు. సోమవారం బి.కొత్తకోటలో చైర్మన్ అభ్యర్థి పాగొండ ఖలీల్, యువనేత పెద్దిరెడ్డి అభినయ్‌రెడ్డి, వార్డు అభ్యర్థులతో కలిసి విస్తృత ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన మార్గాలు, వీధుల్లో, బస్టాండ్లలో ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న చైర్మన్, వార్డు అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు. మహిళలు, వృద్ధుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
సంక్షేమం, అభివృద్ధి మాదే
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మాట్లాడుతూ బి.కొత్తకోట నగర పంచాయతీలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత తమదేనని అన్నారు. జగనన్న పాలనలో జరిగిన సంక్షేమం ప్రస్తుత కూటమిపాలనలో జరిగిందా అని ప్రశ్నించారు. 23 వేల ఓటర్లు ఉన్న ఈ నగర పంచాయతీలో ఐదేళ్ల జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి ఆర్థిక భరోసా అందిందని అన్నారు. ఐదేళ్లలో నగర పంచాయతీ ప్రజలకు రూ.120 కోట్లను ప్రజల ఖాతాలతో అందించామన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్లు మంజూరు చేయగా..అందులో ప్రస్తుతం జరుగుతున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులు 2021లో మంజూరైన రూ.9.26 కోట్ల నిధులతోనే సాగుతున్నాయన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన రూ.కోటి నిధులను కూటమి ప్రభుత్వం వచ్చాక సద్వినియోగం చేసుకోకుండా వెనక్కి పంపిందని అన్నారు. నగర పంచాయతీ అయిన కొత్తలో ప్రజలు ఇంటిపన్నులకు సంబంధించి ఇబ్బందులు పడుతుంటే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూ.ఒకటిన్నర కోటి పన్ను బకాయిలను రద్దు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబు అభివృద్ధి ఎన్నికల స్టంట్
నగర పంచాయతీలో రూ.12 కోట్ల అభివృద్ధి అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు స్టంట్ చేశారని విమర్శించారు. అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని, అభివృద్ధి పేరుతో నాటకాలు వేయడం ఆయనకు అలవాటని విమర్శించారు. ఎన్నికల్లో కుతంత్రాలు, కుట్రలు చేయడం తప్పితే పట్టణాల అభివృద్దికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు మైనార్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఇగ్బాల్ ఆహ్మద్, పుంగనూరు మున్సిపల్ మాజీ చైర్మన్ షరీఫ్, పార్టీ మండల అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, సీనియర్ నాయకులు చికెన్ మహబూబ్ బాషా, పప్పు రాజారెడ్డి, బుద్ధల వెంకటరెడ్డి, వార్డు అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బి.కొత్తకోట అభివృద్ధికి రూ.15 కోట్లు
తాగునీటికే రూ.9.26 కోట్లు
వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
బి.కొత్తకోటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విస్త్రృత ప్రచారం


