టీడీపీ నేతల ఇళ్లపై నుంచి రాళ్లదాడులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఇళ్లపై నుంచి రాళ్లదాడులు

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

టీడీపీ నేతల ఇళ్లపై నుంచి రాళ్లదాడులు

సాక్షి, మదనపల్లె: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఇలాకా రాయచోటిలో రెండవ రోజు గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ గూండాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దాడులు, రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. వారితోపాటు నామినేషన్లు వేసేందుకు వస్తున్న గ్రామస్తులను పోలీసులే అడ్డుకోగా రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ భయానక వాతావరణం సృష్టించి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ అరాచకాల ఫలితంగా సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు.

ఇంటివద్దే నేతల నిర్బంధం..

రాయచోటిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా పోలీసులు నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డిని రామాపురం మండలంలోని స్వగ్రామంలోని ఇంటిలోనే పోలీసులు నిర్బంధించి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. లక్కిరెడ్డిపల్లి లో మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేసిన పోలీసులు బయటకు రానివ్వలేదు. గాలివీడు మండలానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జిల్లా సుదర్శన్‌ రెడ్డి నూలివీడులో ఉండగా పోలీసులు ఆయనను బలవంతంగా స్వగ్రామం నక్కలవాండ్లపల్లెలోని ఇంటికి తరలించి నిర్బంధించారు. వెలుపల భారీగా పోలీసులు మోహరించారు. శాంతిభద్రతల పేరుతో ఇలా నాయకులను నిర్బంధించి స్వేచ్ఛగా తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. అదే టీడీపీ గుండాలు, ఆ పార్టీ శ్రేణులు నామినేషన్‌ కేంద్రాల వద్ద స్వైర విహారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.

బీజేపీ నేతపై దాడులు

గాలివీడు మండలం నూలివీడులో నామినేషన్లు వేసేందుకు తమ అభ్యర్థులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షుడు హరినాథ్‌ రెడ్డి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వీరిపై దాడి చేశారు. కరల్రు, సీసాలతో విరుచుకుపడ్డారు. దాడిలో హరినాథ్‌ రెడ్డి అనుచరుడు రాజా, అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బాధితులు నామినేషన్లు వేయకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు.

పోలీసులే అడ్డగింత ..

గాలివీడు మండలం అరవీడులో నామినేషన్లు వేసేందుకు వస్తున్న గ్రామస్తులను పోలీసులు సమీపంలోనే రోడ్డుపై అడ్డుకున్నారు. తమను నామినేషన్‌ వేసేందుకు వెళ్ళనివ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు తిరస్కరించి వారిని చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీనిపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అయినప్పటికీ పోలీసులు సహకరించకపోవడంతో మహిళలు ప్రాధేయపడ్డారు. చివరకు పోటీ చేయదల్చిన అభ్యర్థులను వాహనాల్లోకి ఎక్కించుకొన్న పోలీసులు వారిని అటూఇటూ తిప్పుతూ రాత్రి విడిచిపెట్టారు. దాంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయలేకపోయారు.

దారి కాచి దాడి ..

సంబేపల్లి మండలం గుట్టపల్లి గ్రామం అంకిరెడ్డిగారిపల్లె నామినేషన్‌ కేంద్రానికి వస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి శివప్రసాద్‌ నాయుడును టీడీపీ శ్రేణులు దారి కాచి అడ్డుకొని దాడి చేశారు. బైక్‌ పై వస్తున్న ఆయనను ఎస్‌.సోమవరం వద్ద అడ్డుకున్నారు. దాడి చేసి బైక్‌ ధ్వంసం చేయడంతో భయబ్రాంతులకు గురైన ఆయన నామినేషన్‌ వేయకుండానే వెళ్లిపోయారు.

పాల క్యాన్లకు నిప్పు ..

సంబేపల్లిలో ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేశారన్న అక్కసుతో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారు కొప్పల చంద్రయ్య ఇంటి వద్ద దుండగులు పాలకేన్లకు నిప్పు పెట్టారు. ఈ మంటలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అంతటితో వదలక వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ప్రతాప్‌ రెడ్డి ఇంటిముందు బీరు బాటిళ్లు పెట్టి నిప్పు పెట్టారు. అరుపులు కేకలతో భయాందోళనలకు గురి చేశారు. ఆందోళనకు గురైన కుటుంబీకులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు.

నామినేషన్లు అడ్డగింత ..

సంబేపల్లిలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన మహిళలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. సంబేపల్లి పంచాయతీ ఒకటవ వార్డు అభ్యర్థిగా పోటీ చేసేందుకు మండ్ల శివ తులసి నామినేషన్‌ పత్రాలతో రాగా అడ్డుకున్నారు. దాంతో ఆమె నిరుత్సాహంతో నామినేషన్‌ వేయకుండా వెళ్లిపోయారు.

పంచాయతీ నామినేషన్ల రెండో రోజూ

చెలరేగిన టీడీపీ గుండాలు

హసనాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ

మద్దతుదారులపై రాళ్లదాడి

అరవీడు గ్రామస్తులను అడ్డుకున్న

పోలీసులు, రోడ్డుపైనే నిరసన

నామినేషన్‌ వేసేందుకు వస్తున్న

అభ్యర్థిపై దాడి, బైక్‌ ధ్వంసం

శ్రీకాంత్‌ రెడ్డి, రమేష్‌ రెడ్డి,

సుదర్శన్‌ రెడ్డి గృహ నిర్బంధం

అభ్యర్థుల వెంట వచ్చిన

బీజేపీ నేతలపైనా టీడీపీ దాడి

నామినేషన్‌ వేశారని పాలక్యాన్లకు నిప్పు

అడుగడుగునా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల అడ్డగింత

రామాపురం మండలం హసనాపురంలో నామినేషన్లు వేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు వెళ్తుండగా వారిపై టీడీపీ గుండాలు రాళ్ల వర్షం కురిపించారు. దారిలో ఉన్న టీడీపీ నేతలు ఇళ్లపై నుంచి ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్లను విసురుతూ బీభత్సం చేశారు. కొంతమంది యువకులు పదేపదే రాళ్లు రువ్వడంతో పలువురు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గాయపడ్డారు. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్లు వేసేందుకు వస్తారని ముందస్తు సమాచారంతో ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్లతో దాడులకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement