కార్తిక శోభతో వెలుగొందిన శైవ క్షేత్రాలు! | - | Sakshi
Sakshi News home page

కార్తిక శోభతో వెలుగొందిన శైవ క్షేత్రాలు!

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

● హర హర మహదేవ!

కడప సిటీ: ‘నిండు మనసుతో చెంబుడు నీళ్లు సమర్పిస్తే చాలు.. కోరిన వరాలిస్తాడు. అచంచలమైన భక్తితో ఒక్క మారేడు దళాన్ని అర్పిస్తే చాలు.. ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ ఆదిదేవుడు భోళా శంకరుడు’.. అంటూ భక్తజనం పరవశించిపోయింది. పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ నామంతో మార్మోగాయి.

తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి..

కార్తిక సోమవారం నాడు ఆ ముక్కంటిని తొలి దర్శనం చేసుకున్నా, ఆలయ ప్రాంగణంలో తొలి దీపం వెలిగించినా జన్మజన్మల పాపాలు తొలగి అధిక పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో తెల్లవారుజాము 3.30 గంటల నుంచే భక్తులు పవిత్ర స్నానాలాచరించి భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. వేలాదిగా వెలిగించిన ఆ నేతి దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణాలన్నీ దివ్య శోభను సంతరించుకున్నాయి.

కళకళలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు..

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన పొలతల, కన్యతీర్థం, భానుకోట, భైరవకోన, వెయ్యి నూతుల కోన, దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి క్షేత్రాలతో పాటు ప్రొద్దుటూరులోని ముక్తి రామలింగేశ్వర స్వామి, అగస్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ నాదనాథేశ్వర కోన, శ్రీ నిత్యపూజ కోన, అనిమెలలోని శ్రీ సంగమేశ్వరాలయం తదితర జిల్లాలోని అన్ని చిన్న, పెద్ద శివాలయాల్లో కార్తీక దీప కాంతులు కనువిందు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement