● కల్యాణ వైభోగమే !
కడప సిటీ: కరుణామయుడైన ఆ కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల తొలిగడపగా విరాజిల్లుతున్న దేవునికడప క్షేత్రంలో సోమవారం స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల పరిణయోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు..
ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అర్చక బృందం తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పమాలలు, దివ్యాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కల్యాణ వేదికపై ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. ఆ దివ్య మంగళ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ‘గోవిందా.. గోవిందా’ అంటూ భక్తిపారవశ్యంతో పరవశించిపోయారు.
కార్తీక శోభతో కిటకిటలాడిన ఆలయం..
ఒకవైపు స్వామివారికి ప్రీతిపాత్రమైన శ్రవణా నక్షత్రం, మరోవైపు అత్యంత పవిత్రమైన కార్తీక మాసం కలిసిరావడంతో ఈ పుణ్య ఘడియల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించడం మహాభాగ్యంగా భక్తులు భావించారు. దీంతో ఆలయ ప్రాంగణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


