● బండరాయి పడి వివాహిత దుర్మరణం
కేవీపల్లె : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ మహిళపై బండరాయి పడడంతో ఆమె మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని బండవడ్డిపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా వున్నాయి. బండవడ్డిపల్లెకు చెందిన ఆవులకుంట జ్ఞానేంద్రబాబు, ఆయన భార్య చందన(30) శుక్రవారం గ్రామ సమీపంలో ట్రాక్టర్‌కు రాతి కూసాలు లోడు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో విశ్రాంతి తీసుకోవడానికి చందన ఓ బండరాయి కింద కూర్చొంది. ఇదే సమయంలో పక్కన వెళ్లిన ట్రాక్టర్ బండరాయిని తాకింది. అప్పటికే సరైన పట్టు లేకుండా(అస్థిరంగా) ఉన్న ఆ బండరాయి ఒక్కసారిగా చందనపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


