మదనపల్లె సిటీ : విజ్ఞాన భాండాగారాలుగా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఆశాదీపాలుగా వెలుగొందాల్సిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాలు నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు నిధుల లేమి, మరో వైపు తీవ్రవమైన సిబ్బంది కొరతతో గ్రంథాలయ వ్యవస్థకు నిర్లక్ష్యపు చెదలు పడుతున్నాయి. శనివారం(నవంబర్ 14) నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
సకాలంలో విడుదల కాని నిధులు
ప్రజల నుంచి ఆస్తి పన్ను రూపంలో వసూలు చేసే గ్రంథాలయ సెస్‌ను స్థానిక సంస్థలు మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలు, బి.కొత్తకోట నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు ఎప్పుటికప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయాల్సి ఉంటుంది. కానీ స్థానిక సంస్థల నుంచి కనీస సహకారం అందకపోవడంతో జిల్లాలో సుమారు రూ.4 కోట్ల సెస్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా భవనాలు మరమ్మతు చేయించే దిక్కులేక, వర్షం వస్తే విలువైన పుస్తకాలు తడిసి ముద్దవుతున్నాయి .
116 మంది ఉద్యోగులకు గాను
40 మంది ఉద్యోగులే
మదనపల్లె జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు శాఖ గ్రంథాయాల్లో పాఠకులకు మెరుగైన సేవలు అందించాలంటే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న గ్రంథాలయాల్లో 116 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 40 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న కొద్ది సిబ్బంది పైనే అదనపు పనిభారం పడుతుండటంతో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు సమయానికి తెరుచుకోని పరిస్థితి నెలకొంది.
నిరుద్యోగులకు తప్పని ఇబ్బందులు
డీఎస్సీ, గ్రూప్స్, పోలీసు, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న జిల్లాకు చెందిన వేలాది మంది పేద,మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ గ్రంథాలయాలే దిక్కు. కానీ మౌలిక వసతులు లేమి, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేకపోవడం, ఫ్యానులు పనిచేయకపోవడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన లేటెస్ట్ ఎడిషన్ పుస్తకాలు, దినపత్రికలు కూడా అరకొరగానే అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వం స్పందించాలి
ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా.. ఆచరణలో మాత్రం వాటి అభివృద్ధి గాలికి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెస్ బకాయిలు వసూలు చేసి, ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసి గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని పాఠకులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
గ్రంథాలయాల వివరాలు
జిల్లాలో పేరుకుపోయిన సెస్ బకాయిలు
అందని స్థానిక సంస్థల సహకారం
వేధిస్తున్న సిబ్బంది కొరత
నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు


